అన్యమత ఉద్యోగులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీస్తున్నాయి. టిటిడిలో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులను తాము గుర్తించక ముందే వెళ్లిపోవాలంటూ మొన్ననే హెచ్చరించారు. దీనితో మునుముందు ఈ వివాదం ఏ మలుపు తీసుకుంటుందో అనే ఉత్కంఠ మొదలైంది. శ్రీనివాసుడు సన్నిధిలో ఉద్యోగమంటే హిందువుల మహద్భాగ్యంగా భావిస్తారు. అందుకే సాధారణ ఉద్యోగుల నుంచి ఐఏఎస్ ల వరకు టీటీడీలో పనిచేయడానికి ఉత్సాహం చూపిస్తుంటారు. ఇంత ప్రాధాన్యత ఉన్న టీటీడీలో ఉద్యోగాలకు ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదికి పూర్వం టీటీడీలో ఏ మతస్థుడైనా ఉద్యోగానికి అర్హులే.

కానీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నిబంధనలు మార్చారు. ఒక్క బోధనా విభాగం మినహా మిగిలిన ఏ శాఖలోనూ హిందువులు కాని వారు ఉద్యోగానికి అర్హులు కారు. రెండు వేల నాలుగు నుంచి తిరుమలలో అన్యమత ప్రచార వివాదాలు మొదలవడంతో నిబంధనలు మరింత కఠినతరం చేసింది టీటీడీ. తిరుమలలో అన్యమత ప్రచారం నిషేధించింది. అప్పటి వరకు టీటీడీ విధుల్లో ఉన్న అన్యమత ఉద్యోగులను తిరుమలకు దూరంగా విధులు కేటాయించారు. టీటీడీలో నిబంధనలు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది లో పెట్టిన పూర్తి స్థాయిలో మాత్రం అమలు చేయలేదు. పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తర్వాత టీటీడీలో నలభై ఐదు మంది అన్యమతస్థులు నిబంధనలకు వ్యతిరేకంగా విధుల్లో చేరారు.


వీరిలో అటెండర్లు మొదలుకొని అధికారుల వరకు ఉన్నారు. వీరిలో ఇద్దరు మతమార్పిడికి పాల్పడిన వారు కాగా పదకొండు మంది క్రిస్టియన్ లు, ముప్పై రెండు మంది ముస్లింలు. అన్యమత ఉద్యోగస్తులను అప్రాధాన్య పోస్టుల్లోకి పంపాలన్న నిబంధన కూడా రెండు వేల ఏడు నుంచి అమలు కాలేదు. దీంతో నలభై ఐదు మందిలో ఆరుగురు తిరుమలలోనే విధులు నిర్వహిస్తుండగా మిగిలిన వారు కూడా ప్రాధాన్యత పోస్టులలోనే ఉన్నారు. వెల్ఫేర్ విభాగం డిప్యూటీ ఈవో స్నేహలత గత ఏడాది టీటీడీ వాహనంలో చర్చికి వెళ్లడంతో అన్యమత ఉద్యోగుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అన్యమతస్థులు టీటీడీలో విధులు నిర్వర్తిస్తుండడం టీటీడీ వాహనాల్లోనే చర్చ్ లకు వెళ్లడంపై హిందూ సంఘాలు భగ్గుమన్నాయి.


తిరుమలలో పని చేస్తున్న అన్యమతస్తులని వెంటనే విధుల నుంచి తొలగించాలని లేదంటే ఉద్యమిస్తామని హెచ్చరించడంతో టీటీడీ దిద్దుబాటు చర్యలకు దిగింది. అన్యమతస్థులు ఎంతమంది ఉన్నారు అనే అంశంపై ఈవో అనిల్ కుమార్ సింఘాల్ విజిలెన్స్ అధికారుల నుంచి సమగ్ర నివేదిక తెప్పించుకున్నారు. వీరిలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తర్వాత నలభై ఐదు మంది చేరినట్టు గుర్తించారు. పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో టీటీడీలో అన్యమత ఉద్యోగులకు అర్హత లేదు అనే నిబంధన పెట్టటాన్ని కంటే ముందే స్నేహలత ఉద్యోగుల్లో ఉన్నారు. దీంతో ఆమెపై చర్యలు తీసుకోలేకపోయారు. దీంతో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తర్వాత చేరిన అన్యమత ఉద్యోగులపై దృష్టి సారించారు.


నలభై ఐదు మంది అన్యమత ఉద్యోగుల నుంచి వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసిన సంతృప్తికర సమాధానం రాలేదు. దీంతో నిబంధనల మేరకు తొలగించాల్సి వుంది. అయితే అన్యమత ఉద్యోగులు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో ఈవో సింఘాల్ వారందరినీ అదే కేడర్ అదే జీతభత్యాలతో ప్రభుత్వ శాఖలకు బదిలీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. దీని పై గత ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించిన సానుకూలత రాలేదు. దీంతో ఉద్యోగాల నుంచి ఎందుకు తొలగించకూడదో చెప్పాలంటూ నలభై ఐదు మందికి మరోసారి నోటీసులు జారీ చేశారు. ఆందోళనకు గురైన అన్యమత ఉద్యోగులు వామపక్ష పార్టీలు ప్రజా సంఘాల మద్దతుతో ఆందోళన చేస్తామంటూ టీటీడీని హెచ్చరించారు.


గతేడాది ఫిబ్రవరిలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అన్యమత ఉద్యోగుల వాదనలు విన్న హై కోర్టు వారిని ఉద్యోగాల నుంచి తొలగించవద్దంటూ టీటీడీని ఆదేశించింది. అలాగే టీటీడీ నోటీసులకు సమాధానం ఇవ్వాలని అన్యమత ఉద్యోగులకు ఆదేశించింది. ఆ కేసు హైకోర్టులో నడుస్తుండగానే గత వారం తిరుమల ఆర్టీసీ టికెట్ ల వెనుక అన్యమత ప్రచారం ప్రింటింగ్ వివాదం రేగింది. తిరుమలలో అన్యమత ప్రచారాన్ని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందతో పాటు భక్తులు హిందూ సంస్థలు తీవ్రంగా తప్పుబట్టారు. ప్రభుత్వం పై ముప్పేట దాడి జరగడంతో దిద్దుబాటు చర్యలు ప్రారంభమయ్యాయి. ఘటనకు కారణమైన ఆర్టీసీ నెల్లూరు స్టోర్స్ ఇన్ చార్జిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది.


ఓ వైపు అన్యమత ఉద్యోగులు, మరో వైపు అన్యమత ప్రచారం దీంతో టీటీడీలో వివాదం పతాక స్థాయికి చేరుకుంది. ఈ సమయంలో సీఎస్ ఎల్ వి సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలు చర్చకు కారణమయ్యాయి. శ్రీ వారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం తిరుమలలో అన్యమత ప్రచార ఘటనను తీవ్రంగా పరిగణించారు. తిరుమల లాంటి పుణ్యక్షేత్రాల్లో అన్యమత ప్రచారాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమన్నారు.


దేవాదాయ శాఖలో అన్యమత ఉద్యోగులు ఎవరైనా ఉంటే స్వచ్ఛందంగా ఉద్యోగాలు వదిలి వెళ్లిపోవాలన్నారు. దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఉద్యోగుల ఇళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామన్నారు. సీఎస్ వ్యాఖ్యలతో టీటీడీలో మరోసారి అన్యమత ఉద్యోగుల వ్యవహారం తెరపైకి వచ్చింది. ఈ వివాదానికి సంబంధించి ఇప్పటికే హైకోర్టులో కేసు నడుస్తోంది. ఇప్పుడు టీటీడీతో పాటు దేవాదాయ శాఖ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: