తెలుగుదేశం పార్టీలో అన్న గారి తరువాత పార్టీ కండువా కప్పుకున్నది. పార్టీని జనంలోకి తీసుకువెళ్ళింది నందమూరి హరిక్రిష్ణ. అన్న నందమూరికి  కొడుకు హరిక్రిష్ణ వెన్నంటి ఉండేవారు. సినిమాల్లో అయినా రాజకీయాల్లో అయినా రామారావుకు  హరి కుడిభుజంగా ఉండేవారు.  తెలుగుదేశం పార్టీకి హరిక్రిష్ణ చైతన్య రధసారధి. ఆయన తండ్రినే గురువు దైవంగా భావించి జీవిత పర్యంతం వెన్నంటి  నిలిచారు.


రామారావు సొంతంగా పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చినా పదవి కోరని నిస్వార్ధపరుడు హరిక్రిష్ణ. నాన్న కారుకు డ్రైవర్ గా ఉండాలనుకున్నాడు కానీ సచివాలయంలో  మంత్రిగా పదవులు  అనుభవిద్దామనుకోలేదు. అన్న గారు సైతం తన కుమారులను రాజకీయాల్లో వారసులుగా తీసుకువద్దామని అసలు భావించలేదు. ఇక హరిక్రిష్ణ మంత్రి కావడం అన్నది కూడా చిత్రంగా జరింది. లక్ష్మీ పార్వతి ఎపిసోడ్లో బావ చంద్రబాబుకు వెన్నటి నిలిచిన హరికి అప్పట్లో  బాబు రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. అది కూడా ఆయన ఎమ్మెల్యే కాకుండానే. ఆ విషయం తెలుసుకున్న మాజీ ముఖ్యమంత్రి అన్న గారు సంతోషించారట. పోనీ నన్ను కాదని వెళ్ళిన హరికి మంత్రి పదవి అయినా చంద్రబాబు ఇచ్చాడని అనుకున్నారట.


ఇదే సందర్భంలో ఆయన అన్నారట. తన కుమారులకు రాజకీయాలు అంటే ఆసక్తి లేదని వూరుకున్నానని, అదే హరిక్రిష్ణ తననే అడిగితే మంత్రి పదవి ఏంటి ఏకంగా ముఖ్యమంత్రి పదవే ఇచ్చేవాడినని సన్నిహితులతో వ్యాఖ్యానించారట. రామారావు గారు అలా ఆవేదనతో అన్నా కూడా అది నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పెట్టినపుడు చంద్రబాబు కాంగ్రెస్ లో ఉన్నారు. అప్పట్లో కష్టపడి చమడోడ్చి తిరిగింది కూడా హరిక్రిష్ణ మాత్రమే. ఎన్టీయార్ ఎంత కష్టపడ్డారో అంతకు అంతా హరిక్రిష్ణ కూడా పార్టీ కోసం పడ్డారు. అప్పట్లోనే హరిక్రిష్ణ  రామారావు గారితో తన రాజకీయ ఆసక్తి చెబితే మంత్రిని, ముఖ్యమంత్రిని కూడా చేసేవారు.


పార్టీ కూడా ఎక్కడికీ పోకుండా నందమూరి వంశానికే ఉండేది. స్వచ్చమైన మనసు కాబట్టి హరి రాజకీయ‌ పదవులు ఆశించలేదు. తరువాత చంద్రబాబు తన రాజకీయ లాభం కోసం మంత్రి పదవి ఇచ్చి ఆరు నెలల్లోనే  తిరిగి లాగేసుకున్నారు. ఇదీ హరి రాజకీయ చరిత్ర. ఇక ఆయన సినిమాల్లో కూడా నటించి రియల్ హీరో అనిపించుకున్నారు. 1956 సెప్టెంబర్ 2న పుట్టిన హరిక్రిష్ణ 2018 ఆగస్ట్ 29న తెల్లవారుజామున  నల్గొండ జిల్లాలోని రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి దుర్మరణం పాలు అయ్యారు. ఓ విధంగా రామారావుకు నిజమైన వారసుడు హరిక్రిష్ణ అని మాత్రం టీడీపీ శ్రేణులతో పాటు అంతా అంగీకరిస్తారు.



మరింత సమాచారం తెలుసుకోండి: