వీఆర్వో, వీఆర్‌‌‌‌ఏ వ్యవస్థ రద్దుకు, తహసీల్దార్ల అధికారాల్లో కోత విధించేందుకు తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తున్న తరుణంలో రెవెన్యూ ఉద్యోగులు ఆందోళనకు సిద్ధమయ్యారు. సర్వీస్‌‌‌‌ రూల్స్‌‌‌‌, ప్రమోషన్ లతో పాటు తమ భవితవ్యమేమిటో తేల్చుకునేందుకు రెడీ అవుతున్నారు.


ఇన్నాళ్లు వేరు వేరుగా ఉన్న వీఆర్ ఓ, వీఆర్‌‌‌‌ఏ సంఘాలు ఒక్క తాటిపైకి వచ్చాయి. తమ ఉద్యోగాలకే ముప్పు ఏర్పడినట్టు భావిస్తున్న ఉద్యోగులు .. ఉద్యమాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించారు. హైదరాబాద్‌‌‌‌ వసతి గృహంలో రెవెన్యూ ఉద్యోగుల సమ్మేళనం జరిగింది.  రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి హాజరైన వీఆర్ ఓలు ముఖ్యమంత్రి కేసీఆర్ రెవెన్యూ శాఖ పై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. రెవెన్యూ శాఖను కాపాడాలని.. ఇతర శాఖల్లో విలీనం చేయొద్దని డిమాండ్ చేశారు. త్వరలో వేలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని వీఆర్వో, వీఆర్ఏ సంఘాల నేతలు చెప్పారు. 


ఉద్యోగుల సంఘాల నుంచి రాజకీయాల్లోకి వెళ్లిన వాళ్లే ఇప్పుడు ఉద్యోగులకు నష్టం చేస్తున్నారన్నారని తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. రెవెన్యూ వ్యవస్థ గురించి, ఉద్యోగుల భవిష్యత్ గురించి తెలుసుకునేందుకు ప్రగతి భవన్ గేటు దగ్గరకు కూడా రానివ్వడం లేదన్నారు. తమ ఉద్యమానికి టీఎన్ జీవోలతో పాటు పలు ఉద్యోగ సంఘాల మద్దతు ఉందని గోల్కొండ సతీష్, తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్షుడు  అన్నారు.  


ఇదిలా ఉంటే రెవెన్యూ వ్యవస్థను కాపాడుకునేందుకు పలు రెవెన్యూ సంఘాలు ఏకతాటిపైకి వచ్చాయి. అందులో భాగంగా తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ లో తెలంగాణ తహశీల్దార్స్ అసోసియేషన్ విలీనం అయ్యింది. ఇప్పటి వరకు టీజీటీఏ అధ్యక్షుడుగా ఉన్న గౌతమ్ కుమార్ ను ట్రెసా ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకుట్టు ట్రెసా వర్గాలు తెలిపాయి. రెవెన్యూ శాఖ పటిష్టతకు, ఉద్యోగుల సంక్షేమం కోసం నిరంతరంగా పని చేస్తామని ట్రెసా నేతలు అంటున్నారు. మొత్తం మీద.. రెవెన్యూ ఉద్యోగ సంఘాలు పోరుబాట పట్టాయి. మరి దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. 




మరింత సమాచారం తెలుసుకోండి: