దేశంలోనే అతిపెద్ద అరటి మార్కెట్ యార్డుగా పేరుగాంచిన తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట మార్కెట్ యార్డ్ లో సిబ్బంది చేతివాటంతో నలభై లక్షల అవినీతి వెలుగు చూసింది. ఈ ఘటనలో ఐదుగురు మార్కెట్ యార్డ్ సిబ్బంది పై సస్పెన్షన్ వేటు పడగా వీరిలో నలుగురి పై క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ దేశంలోని అతిపెద్ద అరటి మార్కెట్ గా గుర్తింపు పొందింది.

ఈ మార్కెట్ కమిటీకి ఇటు కొత్తపేట లోనూ రావులపాలెంలో యార్డులున్నాయి.రావులపాలెం యార్డులో అరటి అమ్మకాలు సాగుతుండగా కొత్తపేట యార్డులో మాత్రం రైతులు పంటలు దాచుకునే గోదాములున్నాయి. కొత్తపేట మార్కెట్ కు చెక్ పోస్టులు ఉండగా రోజు వారీగా రైతుల ఉత్పత్తి అమ్మకాలపై సుంకాలు వసూలు చేస్తుంటారు. రోజువారి సుంకాల వసూళ్లను ఆయా చెక్ పోస్టు సిబ్బంది ట్రెజరీ ద్వారా నేరుగా జమ చేయాలి.

అయితే వసూలు చేసే సుంకాలను ఖాతాలో జమ చేయకుండా సిబ్బంది తమ జేబుల్లో వేసుకున్నారు. రెండు వేల పధ్ధెనిమిది జూన్ లో ఆడిట్ సందర్భంగా ఈ విషయం బయటపడింది.కాని ఆనాటి మార్కెట్ కమిటీ పాలక మండలి వ్యవహారం బయటపెడితే మార్కెట్ కమిటీ పరువు పోతుందని విషయం బయటకు రాకుండా చేశారు. మరోసారి ఆడిట్ లో మరో పదమూడు లక్షలు మాయమైనట్లు బయటపడింది. ఈ మొత్తం వ్యవహారం కమిషనర్ దృష్టికి వెళ్లడంతో ఈ ఘటనకు బాధ్యులుగా ఐదుగురి పై సస్పెన్షన్ వేటు వేశారు. ఇందులో నలుగురి పై క్రిమినల్ కేసు కూడా నమోదు చెయ్యాలని ఆదేశాలిచ్చారు.

ఇదే ఘటనలో నాటి సెక్రటరీలపై కూడా చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. కొత్తపేట మార్కెట్ యార్డులో జరిగిన సిబ్బంది అవినీతి వ్యవహారంపై ఉన్నత స్థాయి విచారణ కూడా నిర్వహించేందుకు కమిషనర్ ప్రయత్నిస్తుండటంతో ఇంకా ఎవరిపై వేటు పడుతుందో అంటూ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. మార్కెట్ కమిటీల్లో సాగిన ఈ అవినీతి వ్యవహారం ప్రస్తుతం సంచలనంగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: