ఏపీ రాజ‌ధాని విష‌యంలో రోజుకో గంద‌ర‌గోళం న‌డుస్తోంది. వైసీపీకి చెందిన మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ చేసిన ప్ర‌క‌ట‌న‌తో రాజ‌ధాని విష‌యంలో పార్టీల నేత‌లే కాకుండా సామాన్యులు కూడా గంద‌ర‌గోళంలో ప‌డిపోయారు. ఇదిలా ఉంటే టీడీపీకి చెందిన సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు తాజాగా మ‌రో సంచ‌ల‌న వ్యాఖ్య చేయ‌డంతో అది టీడీపీ వ‌ర్గాల్లోనే ప్ర‌కంప‌న‌లు రేపుతోంది. రాజధాని అమరావతిపై మంత్రుల గందరగోళ వ్యాఖ్యల నేపథ్యంలో ప్రజల్లో అయోమయం నెలకొందన్న గంటా విశాఖకు అన్ని అర్హతలు ఉన్నాయని.. ఆర్థిక రాజధానిగా ప్రకటించాలని కోరారు. 


అమరావతి భూకుంభకోణం జరిగితే అధికారంలో ఉన్నవారు తేల్చాలన్నారు. రాజధాని కుంభకోణం ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమని గంటా స్పష్టం చేశారు. రాజధానిపై అప్పట్లో అసెంబ్లీ సాక్షిగా జగన్‌ అంగీకారం తెలిపారని.. ఎక్కడపెట్టినా 30 వేల ఎకరాలు ఉండాలని ఆయన సూచించినట్లు గంటా గుర్తు చేశారు. శివరామకృష్ణ కమిటీ నివేదికలోనూ విజయవాడ, గుంటూరువైపే మొగ్గు చూపారన్నారు. 


గంటా ప్ర‌క‌ట‌న‌తో టీడీపీలో క‌ల్లోలం...
విశాఖ‌లో విశాఖ‌ను ఆర్థిక రాజ‌ధానిగా చేయాల‌ని గంటా చేసిన ప్ర‌క‌ట‌న‌తో టీడీపీ వ‌ర్గాల్లోనే క‌ల్లోలం మొద‌లైంది. గంటా ఈ ప్ర‌క‌ట‌న చేయ‌డం వెన‌క టీడీపీ అమ‌రావ‌తి మార్పు విష‌యంలో మాన‌సికంగా సిద్ధ‌మైందా ?  లేదా గంటా పార్టీతో సంబంధం లేకుండా టీడీపీ ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న పెట్టి త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తు కోసం కొత్త‌దారులు వెతుక్కుంటున్నారా ? అన్న సందేహాలు కూడా రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి.


గంటా ఇప్ప‌టికే టీడీపీలో అసంతృప్తితో ఉన్నారు. ఇటు రాజ‌ధాని మార్పుపై వైసీపీ ఎలాంటి నిర్ణ‌యం అయినా తీసుకునే ఛాన్స్ ఉంది. తాజా వ‌ర‌ద‌ల‌తో చివ‌ర‌కు చంద్ర‌బాబు ఇళ్లే మునిగిపోయింది. అటు ప‌ర్యావ‌ర‌ణ వేత్త‌లు కూడా తీవ్రంగా ఆందోళ‌న చెందుతున్నారు. ఈ నేప‌థ్యంలో గంటా చేసిన ప్ర‌క‌ట‌న‌తో రాజ‌ధాని మార్చేస్తార‌ని టీడీపీ డిసైడ్ అయ్యిందా ? అందుకే గంటా ఈ ప్ర‌క‌ట‌న చేశాడా ?  లేదా వ్య‌క్తిగ‌తంగా ఈ ప్ర‌క‌ట‌న చేశారా ? అన్న‌ది తెలియ‌డం లేదు. ఈ ప్ర‌క‌ట‌న మాత్రం టీడీపీలో ముస‌లానికి కార‌ణంగా క‌నిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: