అంతా ఒక పార్టీ వారే, అధినేత లైన్ గీస్తే దాన్ని దాటే సాహసం ఎవరూ చేయరు. అయితే ఆ సమావేశంలో మాత్రం డిఫరెంట్ సీన్ కనిపించింది. బుల్లెట్ లాంటి మాటలతో చెలరేగిపోయారు. పిలిచి అవమానిస్తారా అని ఒకరు అసలు మేం ఇక్కడ ఎందుకు ఉండాలని మరికొందరు ఎవరికి వారు తమ మాట నెగ్గించుకోడానికి మాటల తూటాలు పేల్చుకున్నారు. మీటింగ్ లో ఉన్న మంత్రి జిల్లా కలెక్టర్ ఎంత వారించినా ఎవ్వరూ తగ్గలేదు ఇంతకీ అంత హాట్ హాట్ గా సాగిన సమావేశమేదీ. ఒకే పార్టీ నేతలు ఎందుకంత పంతాలకు వెళ్లాల్సి వచ్చింది. అనంతపురం కలెక్టరేట్ ప్రతి ఏడాది మాదిరే ఈ సారి కూడా ఇరిగేషన్ అడ్వయిజరీ బోర్డు మీటింగ్ జరిగింది. తుంగభద్ర జలాశయం నీటి కేటాయింపులపై ప్రతి ఏటా ఐఏబీ సమావేశం జరుగుతుంది.తుంగభద్ర ఎగువ కాలువైన హెచ్చెల్సీ లో అనంతపురం కడప జిల్లాతో పాటు కొంత మేర కర్నూలుకి కూడా వాటా ఉంది. ఈ నీటి కేటాయింపులపై ఐఏబీ సమావేశంలో భిన్నమైన వాదనలు జరుగుతున్నాయి.


అయితే తాజాగా జరిగిన సమావేశం కాస్త డిఫరెంట్ గా సాగింది. మాటల తూటాలు నేతల పట్టింపులూ అలకలతో దద్దరిల్లిపోయింది. ఈ సమావేశంలో దాదాపు అందరూ వైసిపి ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కడప జిల్లా నుంచి కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాధ్ రెడ్డి, ఎంపి అవినాష్ రెడ్డి లు హాజరయ్యారు. అనంతపురం జిల్లాలో ఉన్న పన్నెండు మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఇద్దరు టిడిపి ఎమ్మెల్సీలు మీటింగ్ లో పాల్గొన్నారు. ఆ జిల్లాలకు చెందిన ఇద్దరు టిడిపి ఎమ్మెల్యేలు నందమూరి బాలకృష్ణ, పయ్యావుల కేశవ్ లు గైర్హాజరయ్యారు.


కలెక్టర్ సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం మంత్రి శంకరనారాయణ లీడ్ చేశారు. సాధారణంగా వైసిపి ఎమ్మెల్యేలలో బాగా యూనిటీ కనిపిస్తుంది. పార్టీ అధినేత గీసిన గీత దాటి సాహసం ఎవరూ చేయరు. అయితే ఈ సమావేశంలో మాత్రం నీటి కేటాయింపుల అంశం వారి మధ్య చిచ్చు పెట్టింది. తామంతా ఒకే పార్టీ అన్న సంగతి మరిచిపోయి చెలరేగిపోయారు. తమ నియోజక వర్గ ప్రయోజనాలే తమకు ముఖ్యమన్న భావంతో వ్యవహరించారు. సమావేశం ప్రారంభం లోనే తమ ప్రాంతానికి నీళ్లివ్వాలనీ కడప ఎంపీ అవినాష్ ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డిలు బలమైన వాయిస్ వినిపించారు. ప్రతిసారీ తమను పిలిచి అవమానిస్తారా అంటూ ఫైరయ్యారు.


దాంతో సమావేశం కాసేపు కడప వర్సస్ అనంతపురం అన్నట్లు మారింది. ఇక కడప జిల్లా నుంచి వచ్చిన ఇద్దరు నేతలు వెళ్లిపోగానే అసలు వార్ స్టార్ట్ అయ్యింది. అనంతపురం జిల్లాకు చెందిన పన్నెండు మంది వైసీపీ నేతలు ఎవరికి వారుగా విడిపోయారు. తమ ప్రాంతానికి నీరు కావాలంటే, తమ ప్రాంతానికి కావాలని పంతాలకు పోయారు. ఈ సమావేశంలో ధర్మవరం అనంతపురం శింగనమల తాడిపత్రి ఎమ్మెల్యేలు బలమైన గొంతు వినిపించారు. గత కొన్నేళ్లుగా తమకు అన్యాయం జరుగుతుందని నీరివ్వకపోతే నియోజకవర్గానికి ఏ ముఖం పెట్టుకుని వెళ్ళాలని ప్రశ్నించారు. వాస్తవానికి ఏ ప్రాంతానికి ఎంత నీరు విడుదల చేస్తామన్నది అధికారులు అధికారికంగా ప్రకటించాలి.


ప్రజా ప్రతినిధుల సూచనలు తీసుకుని నిర్దిష్టమైన ప్రణాళికను ప్రభుత్వానికి అందించిన తర్వాత నీటి విడుదల జరుగుతుంది. అయితే ఈ మీటింగ్ లో ఆ పద్ధతి కనిపించలేదు. ప్రాంతాల వారీగా నీరు ఎలా వదులుతారో చెప్పాలంటూ ఎమ్మెల్యేలు అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. దాంతో ఉన్నదే కొంచెం నీరు కావడంతో సమాధానం చెప్పలేక అధికారులు మల్లగుల్లాలు పడ్డారు. సమావేశంలో కలెక్టర్ మాటలను ఎవరూ పట్టించుకోలేదు. ఇక మంత్రి ఎంత వారించినా ఎవరూ వినలేదు. దీంతో ఎప్పుడూ శాంతంగా కనిపించే మంత్రి శంకర నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పనిలో పనిగా ఆ ప్రాంత గొంతు వినిపించారు. మొత్తం మీద సీమ నాయకుల ప్రతాపం ఐఏబీ సమావేశంలో స్పష్టంగా కనిపించింది.


అయితే అంతా ఒకే పార్టీవారు అయివుండి కూడా అలా ప్రాంతాల వారీగా విడిపోవటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తీవ్ర కరువు ఎదుర్కొంటున్న అనంతపురం జిల్లాలో ప్రస్తుతం తీవ్ర నీటి ఎద్దడి ఉంది. దాంతో జనం నుంచి ప్రజా ప్రతినిధులపై తీవ్ర ఒత్తిడి పెరుగుతుంది. ఈ క్రమంలో ఎక్కడైనా తమ్ముడు కాని ఇక్కడ మాత్రం కాదు అన్నట్లు నీటి లెక్కలతో హాట్ హాట్ గా సాగింది సమావేశం. టోటల్ గా ఐఏబీ సమావేశం మొత్తం టూ డిఫరెంట్ అన్నట్టుగా సాగిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: