ఇపుడు తండ్రి, కొడుకుల్లో ఎవరు సమాధానం చెబుతారో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు, లోకేష్ తోడల్లుడు శ్రీ భరత్ ఇన్ సైడర్ ట్రేడింగ్ వ్యవహారాలు బట్టబయలైపోయింది. ఎప్పుడైతే సిఆర్డీఏ అధికారులు నోరిప్పారో అప్పుడే చంద్రబాబు, బాలకృష్ణ కుటుంబాలు రెండు అడ్డంగా బుక్కైపోయినట్లే.

 

రాజధాని ప్రాంతంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగింది వాస్తవం.  జరిగిన ఇన్ సైడర్ ట్రేడింగ్ వల్ల టిడిపిలో ముఖ్య నేతలు వేల కోట్ల రూపాయలు లబ్ది పొందింది కూడా వాస్తవమే. లబ్దిపొందిన వారి వివరాలు, ఏ మేరకు లబ్దిపొందారు అన్న విషయాలు సోషల్ మీడియాలో ఎప్పటి నుండో ప్రచారంలో ఉన్నాయి. అయితే శంకులో నుండి పోస్తే కానీ తీర్ధం కాదన్న చందంగా ప్రచారం అలాగే ఉండిపోయింది.

 

అయితే వారం రోజుల తర్వాత ఇదే విషయాన్ని మంత్రి బొత్సా సత్యనారాయణ కదిపారు. కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి, శ్రీ భరత్ వివరాలు శాంపుల్ గా వదిలారు. వాళ్ళిద్దరు ఎక్కడెక్కడ భూములు కొనింది, ఎంతెంతకు కొన్నారు, ప్రస్తుత విలువ ఎంత అన్న వివరాలను బొత్స విడుదల చేశారు. బొత్స విడుదల చేసిన వివరాలతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేగింది.

 

బొత్సాకు కౌంటర్ గా సుజనా మాట్లాడుదామని అనుకుని కూడా చివరి నిముషంలో మానుకున్నారు. అయితే భరత్ మీడియాతో మాట్లాడుతూ బొత్సా చెప్పిన వివరాలు అబద్ధాలన్నారు. తమకు కాంగ్రెస్ హయాంలోనే భూములు ఎలాట్ అయినట్లు చెప్పారు. అయితే సిఆర్డీఏ విడుదల చేసిన వివరాలతో భరత్ చెప్పిందే అబద్ధమని తేలిపోయింది. భరత్ కుటుంబానికి చంద్రబాబు హయాంలో  2015, జూలై 15వ తేదీనే భూములు ఎలాట్ అయిన జీవో కాపీలను విడుదల చేశారు. తర్వాతే వాళ్ళ భూములను సిఆర్డీఏ పరిధిలోకి చేర్చినట్లు కూడా అర్ధమవుతోంది.

 

ఎప్పుడైతే సిఆర్డీఏ భూములు ఎలాట్ చేసిన జీవో కాపీలను కూడా విడుదల చేసిందో రెండు కుటుంబాలు అడ్డంగా బుక్కైపోయినట్లే అనుకోవాలి. మరి ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని తెలిసిపోతోంది.  చంద్రబాబు వల్లే భరత్ కు అనుచితంగా లబ్ది జరిగిందని అర్ధమైపోతోంది. కాబట్టి భరత్ కు అనుచిత లబ్ది విషయంలో తండ్రి, కొడుకుల్లో ఎవరు సమాధానం చెబుతారో చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: