2018 డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన టీఆర్ఎస్ పార్టీ  ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో చాలామంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలని, నేతలని పార్టీలోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే మొదట్లో ఆపరేషన్ ఆకర్ష్ ని ఉదృతంగా చేసిన గులాబీ పార్టీ ప్రస్తుతం సైలెంట్ గానే ఉంది. కానీ లోక్ సభ ఎన్నికల్లో నాలుగు ఎంపీ సీట్లని గెలుచుకున్న బీజేపీ ఆపరేషన్ కమలం పేరుతో తెలంగాణలో దూసుకుపోతుంది. ఇప్పటికే పలువురు టీడీపీ, కాంగ్రెస్ నేతలనీ చేర్చుకుంది. ఇంకా మిగతా నేతలపైనా కూడా వల వేస్తోంది.


ఈ క్రమంలోనే టీఆర్ఎస్ ఆహ్వానించిన ఓ కాంగ్రెస్ నేతని తమ పార్టీలోకి తెచ్చుకోవాలని బీజేపీ చూస్తుందని తెలుస్తోంది. ఆ నేత కూడా టీఆర్ఎస్ లోకి వెళ్ళడం కంటే బీజేపీలోకి వెళ్ళడం బెటర్ అనుకుంటున్నారంటా. అయితే ఇంతలా టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు పోటీ పడుతున్న నేత ఎవరో కాదు మంచిర్యాలకు చెందిన కరుడగట్టిన కాంగ్రెస్ వాది ప్రేమ్ సాగర్ రావు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రేమ్ సాగర్ మంచిర్యాల నుంచి టీఆర్ఎస్ అభ్యర్ధిపై స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు. అటు రాష్ట్రంలో కాంగ్రెస్ దారుణంగా ఓడిపోయింది. పైగా నేతలంతా టీఆర్ఎస్ లోకి వెళ్ళిపోయారు.


దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ కు భవిష్యత్ లేదని భావిస్తున్న ప్రేమ్ పార్టీ మారాలని నిర్ణయించుకున్నారట. విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ ప్రేమ్ కు పార్టీలో రమ్మని ఆహ్వానం పంపిందని తెలిసింది. ఎమ్మెల్సీ ఇస్తామని కూడా ఆఫర్ చేశారంట. అయితే ప్రేమ్ మొదట్లో టీఆర్ఎస్ లోకి వెళదామని అనుకుని వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఆయన గులాబీ కంటే కమలం వైపు వెళితే బెటర్ అనుకుంటున్నారంటా. ఎందుకంటే పార్టీలో చేరిన తర్వాత ఎమ్మెల్సీ ఇస్తారో ఇవ్వరో గ్యారంటీ లేకపోవడం, భవిష్యత్తులో మంచిర్యాల ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తామని చెబుతున్నా నమ్మకం లేకపోవడం.


గతంలో పార్టీలో చేరిన రమేష్ రాథోడ్‌కు టీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో హ్యాండ్ ఇచ్చింది. అప్పుడు రమేశ్ కు ఎదురైన అనుభవం, తనకూ తప్పదన్న అనుమానం సాగర్‌లో మొదలైందట. ఒకవేళ చేరిన తర్వాత టికెట్ ఇవ్వకపోతే ఏంటని రాజకీయ భవిష్యత్తుపై ఆందోళన చెందున్నారట. దాంతో రాని టికెట్ గురించి ఆలోచించడం కన్నా, గ్యారంటీగా టిక్కెట్ వచ్చే బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారట. 


పైగా టీఆర్ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత, తన వ్యాపారాలు బాగా దెబ్బతీసిందని ప్రేమ్ ఇంకా లోపల ఫీల్ అవుతూనే ఉన్నారట.  ఇటు భవిష్యత్తులో కమలం పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి ‌పదవి ఇస్తామని బీజేపీ ఆఫర్ చేసిందంటా. దీంతో ప్రేమ్ కమలం పార్టీలో చేరడానికి సిద్దమవుతున్నారని తెలుస్తోంది. ఆయ‌న ఒక్క‌రే కాదు తెలంగాణ‌లో చాలా మంది కాంగ్రెస్ నేత‌ల ప‌రిస్థితి ఇలాగే ఉంది. మొత్తం మీద ప్రేమ్ ముళ్ళున్న గులాబీ తోటలోకి వెళ్లడంకంటే  సేదతీర్చే కమలం చెంత చేరడం బెటర్ అనుకుంటున్నారట.


మరింత సమాచారం తెలుసుకోండి: