ఏపీలో వైసీపీ జనాలను బతిమాలుకుని ఒక చాన్స్ అంటే అధికారం ఇచ్చారట. పదేళ్ళ పాటు జగన్ కష్టపడి తిరగడం చూసిన జనం సానుభూతితో పోన్లే ఈ అబ్బాయి ఒకసారి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటే తప్పేంటని కేవలం ఒక్క చాన్స్ మాత్రమే ఇచ్చారట. ఇది ఏ రాజకీయ పండితుడూ వేసిన అంచనా కాదు, ఏ సర్వేశ్వరుడు చెప్పిన లెక్క అంతకంటే కాదు మరి ఎవరు చెప్పారు..


ఎవరు చెప్పారంటే టీడీపీ అధినేత చంద్రబాబు. ఆయన తన పార్టీ నాయకులతో చెబుతున్నారు. జగన్ కి జనం ఇచ్చింది ఒక్క చాన్సే. మళ్ళీ నేనే అధికారంలోకి వచ్చేస్తానంటూ చెప్పడం నిజంగా విడ్డూరమే. ఎన్నికలు జరిగి నాలుగు నెలలు మాత్రమే అయ్యాయి. జగన్ పవర్లోకి వచ్చి మూడు నెలలు అయ్యాయి. ఇంకా 57 నెలల పాలన మిగిలే ఉంది. మరి ఇంతలో ఎందుకంత నమ్మకమో బాబుకు, ఈసారి ఎన్నికలు అంటూ జరిగితే టీడీపీ ఖాయంగా వస్తుందని కూడా ఆయన అపుడే చెప్పేసుకుంటున్నారు.


ఏపీలో టీడీపీకి శాశ్వతంగా అధికారం ఇవ్వాలి. అపుడే అభివ్రుధ్ధి జరుగుతుంది అంటూ పాత పాటే మరో మారు పాడుతున్నారు బాబు. టీడీపీకి అధికారం అన్నది చారిత్రాత్మకమైన అవసరం అని కూడా చెబుతున్నారు. జగన్ కి పోనీ పాపం అని జనం ఒక్క చాన్స్ ఇస్తే ఆయన అంతా ఉల్టా సీదా చేసేస్తున్నాడు. అందుకే జనం మళ్ళీ మనల్నే కోరుకుంటారు. ఇది నిజం అంటున్నారు బాబు. 


పైగా తాను ఆశావాదినని కూడా బాబు చెప్పుకుంటున్నారు. ఆశలు ఉండడం మంచిదేకానీ పేరాశలు ఉండరాదు కదా. బాబు పరిస్థితి అలాగే ఉంది. ఒక్క చాన్స్ అంటూ రాజకీయాల్లో ఉంటుందా. అది జరిగే పనేనా పీఠం ఎక్కిన వారు అంత సులువుగా దిగుతారా. అందులోనూ అధికారం మజాను చవి చూసిన వారు మళ్ళీ మళ్ళీ  గెలిచేందుకే చూస్తారు. ఏంటో బాబు గారి చాదస్తం కానీ జగన్ చూస్తే యువకుడు. బాబు వయసు డెబ్బయిల్లో ఉంది. టీడీపీ శాశ్వతం అధికారం శాశ్వతం అని పలవరింపులు చూస్తే ఏమనుకోవాలో.


మరింత సమాచారం తెలుసుకోండి: