మంత్రి ప‌ద‌వి ఎవ‌రి భిక్ష కాదు.. తాను పార్టీలోకి మ‌ధ్య‌లో వ‌చ్చిన వాడిని కాద‌ని, గులాబీ జెండా ఓన‌ర్ల‌లో ఒక‌డిన‌న‌ని మంత్రి ఈట‌ల ఉద్వేగ‌పూరితంగా చేసిన వ్యాఖ్య‌లు దేనికి సంకేతం..?  ఈ వ్యాఖ్య‌ల వెనుక దాగి ఉన్న ఆంత‌ర్యం ఏమిట‌న్న‌దానిపై రాజ‌కీయ‌వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. అనేక ఊహాగానాలూ వినిపిస్తున్నాయి. మంత్రి ప‌ద‌వి ఎవ‌రి భిక్ష కాదు.. గులాబీ జెండా ఓన‌ర్ల‌లో ఒక‌డినంటూ ఈట‌ల చేసిన వ్యాఖ్య‌లు టీఆర్ఎస్ అధినేత‌, ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై ధిక్కార స్వ‌రానికి సంకేత‌మ‌నే టాక్ మాత్రం బ‌లంగా వినిపిస్తోంది. 


నిజానికి.. కొద్దికాలంగా మంత్రి ఈట‌ల‌పై ఒక టాక్ న‌డుస్తోంది. అదేమిటంటే.. ఈట‌ల‌ను మంత్రివ‌ర్గం నుంచి త‌ప్పిస్తార‌ని..! ఈ నేప‌థ్యంలో క‌రీంన‌గ‌ర్ జిల్లా హుజురాబాద్‌లో గురువారం జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో ఈట‌ల ఈ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసి... రాజ‌కీయ‌వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌కు దారితీసారు. 
మంత్రివ‌ర్గం నుంచి తప్పిస్తారని వస్తున్న ఊహాగానాలను మంత్రి ఈట‌ల కొట్టిపారేశారు. ఇక్క‌డ ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇప్పుడు ఆ వ్యాఖ్య‌ల వెనుక ఉన్న ఆంత‌ర్యం ఏమిట‌న్న‌ది గులాబీ శ్రేణుల్లో క‌ల‌క‌లం రేపుతోంది.  తాను బీసీని కాబట్టి కుల ప్రాతిపదికన మంత్రి పదవి కావాలని ఎప్పుడూ అడగలేదని స్పష్టం చేశారు. తనపై జరుగుతున్న చిల్లర ప్రచారంపై సమాధానం చెప్పాల్సిన పని లేదని అన్నారు. 


అంటే.. ఇక్క‌డ‌.. సీఎం కేసీఆర్ త‌న ప్ర‌తిభ‌, తెలంగాణ కోసం సాగించిన పోరాటం ఆధారంగానే మంత్రి ప‌ద‌వి ఇచ్చార‌ని మంత్రి ఈట‌ల చెప్పుకొచ్చినా.. ఆయ‌న మాట‌ల్లో ఏదో.. ఎక్క‌డో తేడా కొడుతోంద‌ని రాజ‌కీయ‌వ‌ర్గాలు అంటున్నాయి. ఆ తేడా ఏమిటో.. మ‌రికొద్ది రోజుల్లోనే తెలిసే అవ‌కాశం ఉందంటూ ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. మంత్రివ‌ర్గం నుంచి త‌ప్పిస్తారంటూ చాలా కాలంగా ప్ర‌చారం జ‌రుగుతున్నా.. ఎన్న‌డు కూడా మంత్రి ఈట‌ల నోరు విప్ప‌లేదు. ఆ విష‌యం గురించి ప‌ట్టించుకోలేదు. ఇదే స‌మ‌యంలో ఆయ‌న కేవ‌లం నియోజ‌క‌వ‌ర్గానికి ప‌రిమితం అయి ఉండ‌డం కూడా ఈ ఊహాగానాల‌కు బ‌లం చేకూరుతోంది. 


ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఒక్క‌సారిగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అనామకుడిగా వచ్చి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. నా మంత్రి పదవి ఎవరి భిక్షా కాదు. బీసీ కోటాలో మంత్రి పదవి కావాలని ఎప్పుడూ అడగలేదు. అధికారం శాశ్వతం కాదు ధర్మం, న్యాయం శాశ్వతం. ప్రజలే చరిత్ర నిర్మాతలు తప్ప నాయకులు కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. కుహానావాదులు, సంకుచిత బుద్ధితో వ్యవహరించేవారు జాగ్రత్తగా ఉండాలి. సొంతంగా ఎదగలేని వారిపట్ల అప్రమత్తంగా ఉండాలి. ఎవరు హీరోనో ఎవరు జీరోనో త్వరలో తెలుస్తుంది అని ఈటల బాంబు పేల్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: