ఓ బ్రాహ్మణుడు  అనారోగ్యంతో మృతిచెందాడు. యథాప్రకారం కుటుంబ సభ్యులు దహన సంస్కారాలు నిర్వహించారు. ఎవరన్నా మృతిచెందితే ఆ ఇళ్లంతా  శుభ్రంచేయడం ఆచారం. అలాగే బ్రాహ్మణుడి కుటుంబసభ్యులు కూడా ఆయన నివసించిన పాడుబడిన ఇంటిని శుభ్రం చేయడం మొదలుపెట్టారు. ఇల్లంతా పరుచుకునున్న మాసిపోయిన పాతదుస్తులు, చిన్న చిన్న మూటలు తీసేస్తుంటే... నమ్మలేని విషయం బయటపడింది. ఆ దుస్తులు, మూటల్లో ఎక్కడ చూసిన డబ్బే. నోట్లు, చిల్లరనాణేలు పెద్ద మొత్తంలో కనిపించాయి. పనికిరానివని పారేయబోయిన మూటల్లోడబ్బులు దొరకడం చూసి కుటుంబ సభ్యులకు ఆశ్చర్యం కలిగింది. 


ఆ  డబ్బులను కుటుంబ సభ్యులు లెక్కించడం ప్రారంభించారు. చిల్లర నాణేల నుంచి పది, ఇరవై, యాభై, వంద, ఐదువందల నోట్లు దాకా వాటిలో ఉన్నాయి. రెండు రోజుల పాటు లెక్కిస్తే ఐదు లక్షల రూపాయలు వచ్చాయి. అయినా ఇంకా లెక్కించాల్సినవి చాలా ఉండడంతో కౌంటింగ్ మిషన్ తెప్పించి మరీ లెక్కించారు. మొత్తంగా ఆ మూటల్లో పదిలక్షల రూపాయల డబ్బులు ఉన్నట్టు తేలింది. ఈ మొత్తం డబ్బు మృతిచెందిన బ్రాహ్మణుడు అప్పలవల్లి సుబ్రహ్మణ్యంకు చెందినదే. ఇంత డబ్బు దగ్గర ఉంచుకుని కూడా చివరిరోజుల్లో ఆయన దుర్భర జీవితం గడిపాడు. 


వల్లి సుబ్రహ్మణ్యం పౌరోహిత్యం చేసేవాడు. భార్య చనిపోవడంతో సుబ్రహ్మణ్యం పదేళ్ల నుంచి తూర్పుగోదావరి జిల్లాలోని తునిలో ఒక ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్నాడు. పొట్టకూటి కోసం సుబ్రహ్మణ్యం యాచకుడిగా కూడా మారాడు. అలా లభించిన రూపాయి రూపాయిని ప్లాస్టిక్ కవర్ లలో పాత దుస్తుల్లో మూటకట్టి ఉంచుకున్నాడు. భారీ మొత్తంలో డబ్బులు ఉన్నప్పటికీ  యాచకుడిగా చివరిరోజుల్లో సుబ్రహ్మణ్యం దయనీయ జీవితం గడపడాన్ని తలచుకుని కుటుంబసభ్యులు ఆవేదన చెందారు. ఈ మొత్తాన్ని బ్రాహ్మణ సంఘానికి విరాళంగా ఇస్తామని అనకాపల్లిలో స్థిరపడిన  సుబ్రహ్మణ్యం కుమారుడు చెబుతున్నాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: