నిర్మాణ వ్యయం తగ్గుతుందని రివర్స్ కు వెళ్లబోతున్నారా.? మంత్రి బొత్స వ్యాఖ్యలు చూస్తుంటే ఇదే నిజమనిపిస్తోంది. సీఆర్డీయేపై సీఎం సమీక్ష ముగిశాక మీడియాతో మాట్లాడిన బొత్స రాజధానిని తరలిస్తామని చెప్పలేదంటూనే ఆర్ధిక స్థితిని బట్టి ముందుకెళతామన్నారు. ఏపీ రాజధాని లోని హ్యాపీనెస్ట్ ప్రాజెక్టుకు సైతం రివర్స్ టెండరింగ్ కు అమలుపరిచే అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సూచన ప్రాయంగా వెల్లడించారు. ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఏపీసీఆర్డీయే పై గురువారం సుమారు రెండు గంటల పాటు సమీక్ష నిర్వహించారు.


ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి బొత్స తర్వాత మీడియాతో మాట్లాడారు.రాజధానికి సంబంధించిన వాస్తవాలను ముఖ్యమంత్రి పరిశీలించారని అమరావతిలో ప్రజాప్రతినిధులు అధికారులు ఉద్యోగుల కోసం నిర్మిస్తున్న హౌసింగ్ టైమర్ల పనులు ఏ దశలో ఉన్నాయో ఆయనకు వివరించామని చెప్పారు. ఏపీసీఆర్డీయే ఆధ్వర్యంలో నిర్మించ తల పెట్టిన హ్యాపీనెస్ట్ ప్రాజెక్టుకు రివర్స్ టెండరింగ్ నిర్వహిస్తే నిర్మాణ వ్యయం తగ్గి ఆ మేరకు అందులోని ఫ్లాట్ లను బుక్ చేసుకునే ప్రజలకు లబ్ధి చేకూరే అవకాశం ఉందన్నారు. రాజధాని కోసం భూములిచ్చిన వారికి కేటాయించిన సుమారు అరవై నాలుగు వేల రిటర్నబుల్ ప్లాట్లలో ఇప్పటి వరకు దాదాపు నలభై మూడు వేల ప్లాట్ల రిజిస్ర్టేషన్ లు పూర్తయ్యాయని జగన్ కు తెలిపామని బొత్స చెప్పారు. ఈ భేటీలో అమరావతికి ముంపు బెడద ప్రస్తావనకు రాలేదని చెప్పారు.


ఇప్పటి వరకు రాజధానిపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్టు చెప్పిన బొత్స రాజధానిని అమరావతి నుంచి తరలిస్తామని తానెక్కడా చెప్పలేదన్నారు. కానీ రాజధానిని తమ ప్రభుత్వం మార్చబోతుందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఎందుకు చెప్పారో ఆయననే అడిగి తెలుసుకోవాలని మీడియాతో అన్నారు. రాజధాని విషయంలో ఎవరికీ ఎటువంటి అనుమానాలు లేవని దాని గురించి ఎవరో ఏదో చెబితే తనకేం సంబంధమని బొత్స ప్రశ్నించారు. అమరావతి కోసం గత ప్రభుత్వ హయాంలో ముప్పై ఐదు వేల కోట్లతో టెండర్ లు పిలిచారని కానీ, వాటికి బ్యాంక్ లతో టైయ్యప్ లేదని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి ఆ పనుల పై ఏ విధంగా ముందుకెళ్లాలో నిర్ణయిస్తామన్నారు.


రాజధానిలో ఇప్పటి వరకూ జరిగిన పనులకు సంబంధించి దాదాపు రెండు వేల ఎనిమిది వందల కోట్ల విలువైన బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని బొత్స చెప్పారు. రాష్ట్రంలోని పదమూడు జిల్లాలను అభివృద్ధి చేయాలన్నదే తమ ధ్యేయమని ఆయన వివరించారు. రాజధాని అంటే రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజలదని, అంతే తప్ప ఏ ఒక్క సామాజిక వర్గానికి చెందినది కాదని తన వ్యాఖ్యలను పునరుద్ఘాటించారు. తమ ప్రభుత్వానికి ఎవరిపైనా కక్ష లేదన్నారు. రాజధానికి భూములిచ్చిన రైతులకు ఇవ్వాల్సిన వార్షిక కౌలును ఇవాళ్టి నుంచే చెల్లించనున్నట్లు బొత్స తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: