టీడీపీకి భావి వారసుడుగా నిన్నటివరకూ కీర్తించబడిన నారా లోకేష్ సత్తా ఏంటో మంగళగిరి ఎన్నికలు చెప్పేశాయి. అందరి మంత్రులతో పాటు ఆయన కూడా ఓడిపోయారు. మరి కొందరి మాదిరిగా ఎంత గాలిలోనైనా గెలిచే సత్తా  ఆయనకు లేదని కూడా రుజువు అయిపోయింది. పార్టీ జాతీయ కార్యదర్శి, టీడీపీకి కాబోయే ముఖ్య మంత్రి ఇలా ఎన్నో  ట్యాగులు ఉన్నా కూడా లోకేష్ కూడా అందరిలాంటివాడేనని తెలిసేసరికి తమ్ముళ్ళు లెక్కచేయడం మానేశారు. అంతే కాదు, పార్టీలో లోకేష్ వల్లనే అంతా జరిగిందని మొహమాటం లేకుండా చంద్రబాబుతో చెప్పాల్సింది చెప్పేస్తున్నారు.


ఇక బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన జగన్ని టార్గెట్ చేయడం ద్వారా లోకేష్  గత మూడు నెలలుగా ట్విట్టర్ పిట్టగానే కనిపించారు. కనీసం మీడియా ముందుకు కూడా రాకుండా లోకేష్ పెడుతున్న ట్వీట్లు కూడా పెద్ద కామెడీగా మారాయి. ఇక లాభం లేదనుకున్నారో ఏమో జనంలోకి లోకేష్ వచ్చేశారు. వెనకాల తండ్రి చంద్రబాబు డైరెక్షన్లో ఇసుక కొరత మీద ఆందోళన అంటూ రోడ్డెక్కారు.  బాగానే ఉంది కానీ మరీ ఇంత తొందరైతే ఎలా లోకేష్ అంటున్నారంతా. 


జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చి మూడు నెలలు మాత్రమే అయింది. పైగా ఇంకా చాలా టైం కూడా ఉంది. ఇప్పటి నుంచే ఆయసపడి రోడ్డు మీదకు వస్తే ఇంక ఇంటికి వెళ్ళేది ఉండదు అయిదేళ్ళూ  రోడ్డు మీదనే ఉండాల్సివస్తోందని అంటున్నారు. ఇక ఇసుక విషయంలో వైసీపీ సర్కార్ చేసిన కొన్ని పొరపాట్లు వల్ల ఇబ్బందులు ఉన్నాయి. కానీ మరో అయిదు రోజుల్లో అంటే సెప్టెంబర్ 5 నుంచి కొత్త ఇసుక పాలసీ వస్తోంది. అందువల్ల జనం సమస్యలు తీరనున్నాయి. ఈ నేపధ్యంలో ఇపుడు ఆందోళనలు చేసి ప్రయోజనం ఏంటి లోకేశా అని తమ్ముళ్ళే అంటున్నారు.


లోకేష్ మరీ ఇంతలా అసహనంతో జగన్ మీద కాలు దువ్వి ఆందోళన బాట పడితే 2024 వరకూ వీటిని పెంచుకుంటూ పోవాలి తప్పించి ఎక్కడా తగ్గించకూడదని  కూడా అంటున్నారు. అలాగే,  లోకేష్  ప్రతీ దాని మీద ఇలాగే రోడ్డు మీదకు రాగలరా. అసలు ఇంతకీ ఈ ఆందోళన‌ను చేస్తున్నది జనం కోసమా లేక టీడీపీలో తన పొజిషన్ కాపాడుకోవడానికా, తమ్ముళ్ల వద్ద భావి నేతను నేనేనని చెప్పుకోవడానికా అన్నది అర్ధంకావడంలేదంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: