ఏపీ మాజీ సీఎం చంద్ర‌బాబుకు సోష‌ల్ మీడియాలో స‌ల‌హాలు వెల్లువెత్తుతున్నాయి. చాలా మంది ఆయ‌న అభిమానులు కొన్ని సూచ‌న‌లు చేస్తున్నారు. వీరిలో పార్టీ అంటే ప్రాణం ఇచ్చేవారు కూడా ఉండ‌డం గ‌మ‌నార్హం. నిజానికి ఇప్పుడు రాష్ట్రంలో ఘోర ప‌రాజ‌యం త‌ర్వాత టీడీపీ ప‌రిస్థితిని ఎలా దారిలో పెట్టాలో అర్ధం కాకుండా పోయింది చంద్ర‌బాబుకు. ముఖ్యంగా తన ఐదేళ్ల పాల‌నా కాలంలో ఏపీని భ్ర‌ష్టు ప‌ట్టించ‌డంలో ముందున్న నాయ‌కుల కార‌ణంగా అటు చంద్ర‌బాబు ప‌రువు, ఇటు పార్టీ ప‌రువు, మొత్తానికి త‌మ్ముళ్ల ప‌రువు కూడా మంట‌గ‌లిసింది. దీంతో ఇప్పుడు పార్టీని కాపాడుకోలేని ప‌రిస్థితిలో ఆయ‌న ఉన్నారు. 


ఈ నేప‌థ్యంలో ఎక్క‌డిక‌క్క‌డ త‌మ్ముళ్లు ఆయ‌న‌ను లెక్క‌చేసే ప‌నికూడా క‌నిపించ‌డం లేదు. పార్టీ అండ చూసుకుని నిన్నటి వ‌ర‌కు చెల‌రేగిన చాలా మంది నాయ‌కులు ఇప్పుడు తెర‌మ‌రుగ‌య్యారు. నిన్న‌టి ఎన్నిక‌ల ముందు వ‌ర‌కు కూడా ఫైర్ బ్రాండ్లుగా వెలుగొందిన గుర‌జాల మాజీ ఎమ్మెల్యే య‌ర‌ప‌తినేని శ్రీనివాస‌రావు, ఆముదాల వ‌ల‌స మాజీ ఎమ్మెల్యే కూన ర‌వి కుమార్‌, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ వంటి వారు ఇప్పుడు ప‌లాయ‌నం చిత్త‌గించార‌నే వ్యాఖ్య‌లు బాహాటంగానే వినిప‌స్తున్నాయి. వీరు స‌హా ప‌లువురు నాయ‌కులు కూడా ప‌రారీలో ఉన్నార‌ని స‌మాచారం. 


నిజానికి వీరంతా కూడా టీడీపీ అధికారంలో ఉండ‌గా.. చెల‌రేగిపోయిన వారే. ఒక్క కూన త‌ప్ప‌.. మిగిలిన వారిపై అక్ర‌మాలు, దోపిడీ కేసులు అప్ప‌ట్లోనే న‌మోద‌య్యాయి. అయితే, అప్ప‌ట్లో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం మేనేజ్ చేయ‌డంతో వీరంతా త‌ప్పించుకున్నారు. నిజానికి వీరంతా కూడా మ‌ళ్లీ చంద్ర‌బాబు ప్ర‌భుత్వం కొలువుదీరుతుంద‌ని ఆశించారు. అయితే, అనూహ్యంగా రాష్ట్రంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం రావ‌డంతో ఇప్పుడు ఆయా కేసుల‌ను పోలీసులు తెర‌మీదికి తెచ్చారు. ఈ క్ర‌మంలోనే వీరంతా ప‌లాయ‌నం చిత్త‌గించార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. 


య‌ర‌ప‌తినేనిపై అక్ర‌మ మైనింగ్ కేసుల క‌త్తులు వేలాడుతుండ‌గా.. అధికారుల‌ను బెదిరించార‌ని కూన ర‌వికుమార్‌పై కేసులు ఉన్నాయి. ఇక‌, దళితులను అసభ్య పదజాలంతో దూషించిన  చింతమనేని ప్రభాకర్‌ అరెస్ట్‌కు రంగం సిద్ధం అయింది. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రస్తుతం చింతమనేని పరారీలో  ఉన్నట్లు సమాచారం. గురువారం పినకడిమిలో దళిత యువకులపై  దాడి చేసిన ఘటనలో మాజీ ఎమ్మెల్యే చింతమనేనిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. అతన్ని తక్షణమే అరెస్ట్‌ చేయాలని దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. 


ఈ నేపథ్యంలో చింతమనేని కోసం పోలీసులు గాలిస్తున్నారు. పరారీలో ఉన్న చింతమనేని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. మ‌రి వీరిని కాపాడుకోవ‌డం మానేయ‌డం ఏంట‌ని ఇప్పుడు సోష‌ల్ మీడియాలో చంద్ర‌బాబును ప్ర‌శ్నిస్తున్నారు నెటిజ‌న్లు. జ‌గ‌న్‌పై పైచేయి సాధించేందుకు ఆయ‌న‌పై ఉద్య‌మాలు చేసేందుకు ఐదేళ్ల స‌మ‌యంలో ఎలాగూ ఉంద‌ని, ఇప్ప‌డు త‌మ్ముళ్ల‌ను కాపాడుకోండ‌ని, అప్పుడే పార్టీ నిల‌బ‌డుతుంద‌ని వారు స‌ల‌హాలు ఇస్తున్నారు. మ‌రి బాబు అలా చేస్తారో లేదో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: