అధికార టీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడిప్పుడే అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. పార్ల‌మెంట్ ఎన్నిక‌లతో మొద‌లైన ఈ క‌ల‌హాలు రోజురోజుకూ ముదురుతున్నాయి. స‌మ‌న్వ‌య‌లోపం, అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు, ఆధిపత్య పోరుతోనే గ్రేట‌ర్‌లో పార్ల‌మెంట్ స్థానాల్లో స‌త్తాచాట‌లేక‌పోయింది టీఆర్ఎస్‌. తాజాగా.. గ్రేట‌ర్‌లో ఓ ఎమ్మెల్యే వ‌ర్సెస్ కార్పొరేటర్ మ‌ధ్య వార్ న‌డుస్తోంది. డివిజ‌న్ అధ్య‌క్షుడి నియామ‌కంతో ఆ విభేధాలు ఒక్క‌సారిగా భ‌గ్గుమ‌న్నాయి. ఇంత‌కీ ఆ ఎమ్మెల్యే, ఆ కార్పొరేటర్ ఎవ‌ర‌ని అనుకుంటున్నారా..?  వారు మ‌రెవ‌రో కాదు.. ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, క‌వాడిగూట కార్పొరేట‌ర్ లాస్య‌నందిత‌. 


త‌న‌ను సంప్ర‌దించ‌కుండానే.. త‌న‌కు తెలియ‌కుండానే.. క‌వాడిగూడ పార్టీ అధ్య‌క్షుడిని ఎలా నియ‌మిస్తార‌మ‌ని లాస్య‌నందిత మండిప‌డుతున్నారు. ఏకంగా ఆమె అనుచ‌రులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాల‌యం వ‌ద్ద నిర‌స‌న తెలిపారు.  టీఆర్‌ఎస్‌ కవాడిగూడ డివిజన్‌ అధ్యక్ష పదవి ఎన్నిక వివాదంగా మారడంతో పార్టీవ‌ర్గాల్లో గంద‌ర‌గోళం నెల‌కొంది. కవాడిగూడ డివిజన్‌ అధ్యక్ష, కార్యదర్శులుగా వి.శ్రీనివా్‌సయాదవ్‌, రాజేశ్‌రామేశ్వరం పేర్లను ఎమ్మెల్యే గోపాల్‌, నియోజకవర్గ ఇన్‌చార్జి రాంబాబు యాదవ్‌ బుధవారం రాత్రి కవాడిగూడ కార్పొరేటర్‌ లేకుండా ప్రకటించారు. 


కవాడిగూడ కార్పొరేటర్‌ లాస్యనందిత, ఎమ్మెల్యే గోపాల్‌ మధ్య అధ్యక్షపదవి ఎంపికలో తీవ్ర విభేదాలు చోటుచేసుకున్నాయి. ఈ విషయం గురువారం తెలుసుకున్న కార్పొరేటర్‌ తనకు తెలియకుండా డివిజన్‌ అధ్యక్షుడిని ఎలా ప్రకటిస్తారని ఎమ్మెల్యేను ప్రశ్నించేందుకు ఇంటికెళ్లారు. అప్ప‌టికే ఆయ‌న అక్క‌డి నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోవ‌డం గ‌మ‌నార్హం. కార్పొరేటర్‌ అనుచరులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం చేరుకొని కార్పొరేటర్‌కు మద్దతుగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఎమ్మెల్యే కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో ఎమ్మెల్యే అనుచరులు క్యాంపు కార్యాలయానికి తాళాలు వేశారు. 


ఈ సందర్భంగా కార్పొరేటర్‌ మాట్లాడుతూ, ఎమ్మెల్యే తమను సంప్రదించకుండానే డివిజన్‌ అధ్యక్షకార్యర్శులను ప్రకటించారన్నారు. గతంలో తనతో అసభ్యంగా మాట్లాడిన డివిజన్‌ ప్రస్తుత అధ్యక్షుడు శ్యామ్‌యాదవ్‌ సోదరుడు వల్లాల శ్రీనివా్‌సయాదవ్‌కు అధ్యక్ష పదవి కట్టబెట్టడం ఎంతవరకు సమంజసమన్నారు. ఒక మహిళా కార్పొరేటర్‌ను అగౌరవపరుస్తూ అనుచితవాఖ్యలు చేసిన వారికి ఎలా పదవి ఇస్తారని ప్రశ్నించారు. వెంటనే కవాడిగూడ అధ్యక్షుడి నియామకాన్ని రద్దు చేసి అందరికీ ఆమోదయోగ్యమైన నాయకుడిని ఎన్నుకోవాలని డిమాండ్‌ చేశారు. 


త్వ‌ర‌లోనే మున్సిప‌ల్ ఎన్నిక‌లు జ‌రుగనున్నాయి. తాజా ప‌రిణామాలు మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ప్ర‌తికూల ఫ‌లితాల‌కు దారితీస్తాయ‌ని పార్టీవ‌ర్గాలు అంటున్నాయి. మొన్న‌నే పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శుల‌తో వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ స‌మావేశ‌మై.. మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌కు సిద్ధంగా ఉండాల‌ని ఆదేశించారు. కానీ.. ఇలా నాయ‌కుల మ‌ధ్య చోటుచేసుకుంటున్న ఆధిప‌త్య పోరుతో ఎన్నిక‌ల్లో తీవ్ర న‌ష్టం వాటిల్లే అవ‌కాశం ఉంటుంద‌ని ప‌లువురు నాయ‌కులు అంటున్నారు. ఈ నేప‌థ్యంలో పార్టీ అధిష్టానం ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి మ‌రి.


మరింత సమాచారం తెలుసుకోండి: