ఆస్తిప‌న్ను, ట్రేడ్ లైసెన్స్ త‌దిత‌ర ప‌న్నులను ఏమాత్రం పెంచ‌కుండా వ్య‌వ‌స్థ‌లోని లోపాల‌ను స‌రిచేయ‌డం ద్వారా అద‌న‌పు ఆదాయాన్ని పొందేందుకు మార్గాలను అన్వేషించాలని నగర మేయర్ బొంతు రామ్మోహన్ జిహెచ్ఎంసి ఉన్నతాధికారులను ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్ లో చేపడుతున్న పలు కార్యక్రమాలు, అభివృద్ది పథకాలు, స్వచ్ఛ కార్యక్రమాలపై నేడు అడిషనల్ కమిషనర్లు, విభాగాధిపతులు, జోనల్ కమిషనర్లతో సుదీర్ఘ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. జిహెచ్ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్ కూడా పాల్గొన్న ఈ సమిక్ష సమావేశంలో మేయర్ రామ్మోహన్ మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్ లో గతంలో ఎన్నడూలేని విధంగా వేలాది కోట్ల రూపాయల వ్యయంతో ఎస్.ఆర్.డి.పి, డబుల్ బెడ్ రూం, మౌలిక సదుపాయాల కల్పన, స్వచ్ఛ కార్యక్రమాల అమలు తదితర ఎన్నో వినూత్న కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. ఈ పథకాల అమలుకు కావాల్సిన నిధుల సేకరణను ఆయా విభాగాలే స్వచ్ఛందంగా సేకరించుకునేందుకు అంతర్గత ఆదాయ మార్గాలను మరింత పటిష్టవంతం చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా నగరంలో ఎన్నో బహుళ అంతస్తుల భవనాలు, కమర్షియల్ భవనాలు తమ అనుమతులకు మించి అదనపు ఫ్లోర్లను అక్రమంగా నిర్మించి వ్యాపారాలు నిర్వహిస్తున్నారని పలు వార్తలు వస్తున్న విషయాన్ని మేయర్ ప్రస్తావించారు. నగరంలో 105 రెసిడెన్షియల్ మార్గాలను కమర్షియల్ రోడ్లుగా ప్రకటిస్తూ ప్రభుత్వం మరికొద్ది రోజుల్లో ఉత్తర్వులు జారీచేయనున్నదని, తద్వారా ఆయా రోడ్లలో ఆదాయం పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత వర్షకాల సీజన్ లో దోమల నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని, ప్రతి బస్తీలు, స్లమ్ లలోనూ, మలేరియా, డెంగ్యూ ప్రభావిత ప్రాంతాల్లో యాంటి లార్వా మందులను పిచికారి చేపట్టాలని తెలియజేశారు. జిహెచ్ఎంసిలో ప్రవేశపెట్టిన డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ద్వారా సత్ఫలితాలు లభిస్తున్నాయని, ఈ బృందాలను ప్రతి సర్కిల్ కు ఒకటి ప్రత్యేకంగా ఏర్పాటు చేసేందుకు తగు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. హైదరాబాద్ లో చేపడుతున్న ఎస్.ఆర్.డి.పి, రోడ్, నాలాల విస్తరణకు చేపడుతున్న భూసేకరణకు గాను అందజేస్తున్న టి.డి.ఆర్ లకు సంబంధించి టి.డి.ఆర్ బ్యాంకును త్వరితగతిన ఏర్పాటు చేయాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రతి విభాగం ద్వారా అమలయ్యే కార్యక్రమాలు, వాటికి అవుతున్న ఆదాయ వ్యయాలు, భవిష్యత్ ప్రణాళికలు, ప్రస్తుత అమలులో ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు, పరిపాలన సంబంధిత సమస్యలు, ఆర్థిక పరమైన అంశాలు తదితర విషయాలపై దాదాపు ఆరు గంటల సేపు సమిక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో అడిషనల్ కమిషనర్లు హరిచందన, అద్వైత్ కుమార్ సింగ్, శృతిఓజా, సిక్తాపట్నాయక్, సందీప్ జా, కెనడి, కృష్ణ, విజయలక్ష్మి, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి, చీఫ్ ఇంజనీర్లు సురేష్ కుమార్, శ్రీధర్, జియాఉద్దీన్, జోనల్ కమిషనర్లు ముషారఫ్ అలీ, శ్రీనివాస్ రెడ్డి లు, శంకరయ్య తదితరులు హాజరయ్యారు.








మరింత సమాచారం తెలుసుకోండి: