తెలుగుదేశం పార్టీ నేతలు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఇసుక సమస్యపై ధర్నాలు, ఆందోళనలు నిర్వహించారు. ఇసుక దొరక్క కూలీలు పస్తుంటున్నారని.. భవన నిర్మాణ రంగంలో స్తబ్దత వచ్చిందని.. ఇసుక ధర అమాంతం పెరిగిందని మండిపడ్డారు. కిలో సిమెంట్ కంటే కిలో ఇసుక ఎక్కువ రేటు ఉందంటూ లోకేశ్ మండిపడ్డారు కూడా.


అయితే.. తెలుగుదేశం పార్టీ నాయకులు ఇసుక ధర్నా చేస్తుంటే ప్రజలంతా నవ్వుకుంటున్నారని వైసీపీ నేతలు కౌంటర్ పంచ్ లు ఇస్తున్నారు. ఐదేళ్లుగా ఇసుకను దోచుకున్న టీడీపీ నేతలే ఇప్పుడు ధర్నా చేయడం విడ్డూరమని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. టీడీపీ నేతల ఇసుక దోపిడీని భరించలేక ప్రజలు వారిని ఓడించారన్నారు. ఇసుక దోపిడీని అడ్డుకున్న తహసీల్దార్‌ వనజాక్షిపై చింతమనేని ప్రభాకర్‌ దాడి చేశారని, అలాంటి చింతమనేని ఇసుక కోసం మాట్లాడితే జనం నవ్వుకుంటున్నారన్నారు.


ఇసుక నుంచి తైలం ఎలా తీయొచ్చో దేవినేని ఉమకు బాగా తెలుసంటూ మరో వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ వెటకారం ఆడారు. దేవినేని ఉమకు ధర్నా చేసే అర్హత లేదన్నారు. గత ఐదేళ్ల పాలనలో టీడీపీ నేతలు ఇసుక దోపిడీ చేసి కోట్ల సంపాదించారన్నారు. ప్రభుత్వ ఆదాయానికి దేవినేని ఉమ లాంటి వ్యక్తులు గండికొట్టారని మండిపడ్డారు. టీడీపీ హయాంలో ఇసుక దందాపై స్టే విధిస్తే ఆ పార్టీ నాయకులే సుప్రీంను ఆశ్రయించారని గుర్తుచేశారు.


చంద్రబాబు, ఆయన కొడుకు ఒక ఇంటిని ఆక్రమించుకుని నివసిస్తున్నారని, గతంలో వారి ఇంటి వెనుక డ్రెడ్జర్ల సాయంతో ఇసుకను తవ్వితే నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ పెనాల్టీ విధించిన విషయాన్ని వారు మర్చిపోయారా ? అంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. టీడీపీ హయాంలో ఇసుక దోపిడీని పలువురు అధికారులు అడ్డుకున్నారని, ఓ మహిళా అధికారిపై నాడు టీడీపీ ఎమ్మెల్యే దాడికి పాల్పడ్డారని విమర్శించారు. నాడు మహిళా అధికారికి అండగా నిలబడాల్సిన చంద్రబాబు, తమ ఎమ్మెల్యేను సమర్థించుకున్నారని, అటువంటి వ్యక్తి ఈరోజున ఇసుక దోపిడీ గురించి మాట్లాడటం కన్నా అన్యాయం, దారుణం ఇంకేమైనా ఉంటుందా అని ఆర్కే అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: