తెలంగాణలో క‌రెంటు మంట‌లు సాగుతున్నాయి. ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూ  కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి విమ‌ర్శ‌లు కొన‌సాగిస్తున్నారు. రేవంత్ కేసీఆర్‌ను టార్గెట్ చేస్తుండ‌గా...తాజాగా మ‌ళ్లీ అదే అంశాన్ని పున‌రుద్ఘాటించారు. ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన రేవంత్ దోపిడీకి కేసీఆర్‌ ఒక ఫార్ములా కనిపెట్టారని రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. ప్రజల కరెంట్‌ సెంటిమెంట్‌ను సీఎం కేసీఆర్‌ కరెన్సీ మూటలు సంపాదించుకోవడానికి వాడుకున్నాడని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు. ఇందులో ప్ర‌ధాని మోదీ స‌న్నిహితుడికి స‌హాయం చేస్తున్నార‌ని ఆరోపించారు. 


చత్తీస్‌గఢ్‌ నుంచి అధిక ధరలకు విద్యుత్‌ ఒప్పందం చేసుకుని, అక్కడి ఒప్పందాన్ని చూపించి ప్రజల్ని మభ్యపెడుతున్నారని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. భద్రాద్రి పవర్‌ ప్రాజెక్ట్‌ ఆలస్యం వల్ల తెలంగాణ ప్రజలు రూ.10 వేల కోట్లు వడ్డీ కట్టాల్సి వస్తోందని, ఇప్పటి వరకు ఒక్క యూనిట్‌ కూడా ఉత్పత్తి చేయలేదని విమర్శించారు. దివాళా తీసిన అదాని కంపెనీ బొగ్గును అమ్ముకోవడానికి కేసీఆర్‌కు లంచాలు ఇచ్చి చత్తీస్‌గఢ్‌తో ఒప్పందం చేయించారని, మార్వా విద్యుత్‌ ప్రాజెక్ట్‌ పని జరగడం కోసం కుట్ర చేశారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. గతంలో సూపర్‌ క్రిటికల్‌ టెక్నాలజీ వాడుకోవాలని కేంద్రం అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చిందని, ఇండియా బుల్స్‌ రూ.6 వేల కోట్లు నష్టపోయి బీహెచ్‌ఈఎల్‌ను ఆశ్రయించిందని, సబ్‌ క్రిటికల్‌ టెక్నాలజీ కాలం చెల్లిందని కిరణ్‌ తిరస్కరించారు. కానీ కేసీఆర్‌ అడ్వాన్సులు ఇచ్చి మరీ కొనుగోలు చేశారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.


ఇదిలాఉండ‌గా, విద్యుత్‌ టెండర్లలో అవకతవకలు జరిగాయని నిరాధారమైన ఆరోపణలుచేస్తూ సీఎం కేసీఆర్‌, సీఎండీ ప్రభాకర్‌రావు, ఎస్పీడీసీఎల్‌ ఎండీ రఘుమారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంపీ రేవంత్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్‌లోని బేగంబజార్‌ పోలీస్‌స్టేషన్‌లో టీఆర్‌ఎస్‌ న్యాయవాదులు ఫిర్యాదుచేశారు. ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు ఒక గొప్ప టెక్నోక్రాట్‌ అని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సముద్రాల వేణుగోపాలాచారి అన్నారు. గత టీడీపీ, కాంగ్రెస్‌ ప్రభుత్వాల హయాంలోనూ విద్యుత్‌రంగ ఉద్యోగిగా ప్రభాకర్‌రావు కీలకంగా పనిచేశారని, ఆయన ఏ పార్టీ కండువా కప్పుకోలేదని స్పష్టం చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: