ప్రభుత్వ రంగానికి చెందిన కెనరా బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు, విజయ బ్యాంకు, సిండికేట్ బ్యాంకులు తాజాగా విలీనం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)లో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ), యునైటెడ్ బ్యాంకులు విలీనమవనుండగా, కెనరా బ్యాంక్‌లో సిండికేట్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్‌లో ఆంధ్రాబ్యాంక్, కార్పొరేషన్ బ్యాంకులు, ఇండియన్ బ్యాంక్‌లో అలహాబాద్ బ్యాంకు కలిసిపోనున్నాయి. దీంతో 30వేలకుపైగా శాఖలు విలీనంకానున్నాయి. అలాగే ప్రభుత్వరంగ బ్యాంకులు 27 నుంచి 12కి తగ్గనున్నాయి. మొండి బకాయిలతో సతమతమవుతున్న బ్యాంకులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి, రుణ వితరణ పెంచడానికి, ఆర్థిక రంగాన్ని పటిష్ఠం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అయితే ఇందులో కర్ణాటక‌కు చెందిన వారికి షాకిచ్చారు.


ఈ నాలుగు బ్యాంకులు ప్రధానంగా ఉడిపి జిల్లా నుంచి ఆవిర్భవించడం మరో విశేషం. 1906 మార్చి 12న దక్షిణ కర్ణాటక జిల్లాలో ఒక‌టైన తొలి బ్యాంకు కార్పొరేషన్ బ్యాంకు. ప్రముఖ ఆలయ నగరమైన ఉడిపిలో ఖాన్ బహదూర్ హాజీ అబ్దుల్లా హాజి ఖాసిం బహదూర్ సాహెబ్ దీన్ని నెలకొల్పగా 1980లో జాతీయకరణ జరిగింది. 1906 జూలైలో దక్షిణ కర్ణాటకలోని మరో నగరమైన మంగళూరులో అమ్మెంబల్ సుబ్బారావు కెనరా బ్యాంకును ఏర్పాటు చేయగా 1969లో దీన్ని జాతీ యం చేశారు. 1925లో ఉడిపికి చెందిన ముగ్గురు సామాజికవేత్తలు ఏర్పాటు చేసిన కెనరా ఇండస్ట్రియల్ అండ్ బ్యాంకింగ్ సిండికేట్ లిమిటెడ్ 1954లో సిండికేట్ బ్యాంకుగా రూపాంతరం చెంది 1969లో జాతీయకరణ చెందింది. 1930 నాటి ఆర్ధిక మాంద్యం పరిస్థితుల్లో రైతుల ప్రయోజనం కోసం స్థానిక రైతు ఏబీ శెట్టి విజయా బ్యాంకును ఏర్పాటు చేయగా 1980లో జాతీయకరణ జరిగింది. బ్యాంకుల మెగా విలీనం నేపథ్యంలో రాష్ర్టానికి చెందిన నాలుగు జాతీయ బ్యాంకులు ఉనికిని కోల్పోవడంపై కన్నడ వాసులు విలవిలలాడుతున్నారు. తమ ఆవేదనను సామాజిక మాధ్యమాల్లో వెళ్లగక్కుతున్నారు.  


కాగా, ఈ పది బ్యాంకులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి రూ.52,250 కోట్ల నిధులను వెచ్చించనున్నట్లు కేంద్రం తాజాగా ప్రకటించింది. మొండి బకాయిలతో సతమతమవుతున్న పీఎస్‌బీలను ఆర్థికంగా ఆదుకోవడంలో భాగంగా ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఈ విలీనం వల్ల ఉద్యోగులకు ఎలాంటి నష్టంవాటిల్లదని ఆర్థిక కార్యదర్శి రాజీవ్ కుమార్ తెలిపారు. 2017లో ఎస్బీఐలో తన అనుబంధ ఐదు బ్యాంకులను విలీనం చేయ గా, ఆ తర్వాతి క్రమంలో దేనా, విజయా బ్యాంకులను బీవోబీలో కలిపివేసింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: