ఎస్సార్ ఎస్పీ ప్రాజెక్టుకు భద్రత కరువైందా, అసలు ఉండాల్సిన భద్రతా సిబ్బంది ఎంత, ప్రస్తుతం ఉంటుంది ఎంతమంది, ఉగ్రవాదులు ప్రధాన ప్రాజెక్టులను టార్గెట్ గా చేసుకుంటున్నారని ఇంటెలిజెన్స్ బ్యూరో వెల్లడించిన నేపథ్యంలో ఎస్సారెస్పీ ప్రాజెక్ట్ సేఫ్ జోన్ లోనే ఉందా, ప్రాజెక్టుకు భద్రత కల్పించాలనీ మూడేళ్ల క్రితం అధికారులు పంపిన నివేదికకు కార్యరూపం దాల్చేదెప్పుడు. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు భద్రత కల్పించే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. మూడేళ్ల క్రితం శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు భద్రత కల్పించాలని అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపినా ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. అది ఓకే అయితే నూట యాభై మంది సెక్యూరిటీతో కూడిన టీమ్ తో నిరంతర పర్యవేక్షణ ఉంటుంది.


ఇందు కోసం ప్రభుత్వం ఏడు కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. ఈ ప్రతిపాదనను అధికారులు గతంలో పంపించారు కూడా. అయితే శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు టాప్ ప్రయారిటీ ఇవ్వాలి అనుకుంటేనే తమ ప్రతిపాదనలను ఓకే చేసి సరైన భద్రతను కల్పిస్తారని ప్రాజెక్టు అధికారులు చెప్పుకొస్తున్నారు. ఒకసారి ప్రతిపాదనలు పంపిన తరువాత మళ్లీ పంపించే పరిస్థితి ఉండదని ఎస్సార్ ఎస్పీ భద్రత అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని అధికారులు చెప్తున్నారు. నూట యాభై మంది సెక్యూరిటీతో భద్రత కల్పించాల్సి వుండగా ప్రస్తుతం నలుగురు కానిస్టేబుల్స్ తోనే నెట్టుకొస్తున్నారు. అంటే ఐదు శాతం కూడా భద్రతను కల్పించలేని పరిస్థితి.


ఆ నలుగురు కూడా షిప్టుకు ఇద్దరు చొప్పున విధులు నిర్వహిస్తున్నారు. ఏదైనా ఘటన జరిగితే వెంటనే బలగాలు రావటానికి సమీపంలోని పీఎస్ లో సరిపడా సిబ్బంది కూడా లేరు. శ్రీరాం సాగర్ ప్రాజెక్టు మెండోర పోలీస్టేషన్ పరిధిలో ఉంది. ఇక్కడ ఎస్సై ఒక హెడ్ కానిస్టేబుల్ ఐదుగురు కానిస్టేబుళ్లు మాత్రమే ఉన్నారు. సమీపంలోని ముప్కాల్ పీఎస్ లోనూ సిబ్బంది కొరత ఉంది. అత్యవసర సమయంలో ప్రాజెక్టు వద్దకు రావాలంటే వచ్చే పరిస్థితి లేదు.


రైనీ సీజన్ లోనూ ప్రాజెక్టు గేట్లు ఓపెన్ చేసిన సమయాల్లో ప్రాజెక్టు అందాలు తిలకించడానికి పెద్ద ఎత్తున పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. ఉగ్రవాదుల చేతిలో పలు సాగు నీటి ప్రాజెక్టుల సమాచారం ఉందని ఇప్పటికే ఇంటెలిజెన్స్ బ్యూరో వెల్లడించింది. ఆ లిస్టులో శ్రీరాం సాగర్ ప్రాజెక్టు లేనప్పటికీ భద్రత విషయంలో నిర్లక్ష్యం వహిస్తే నష్టం తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి. గోదావరి బేసిన్ లో ఉన్న ప్రాజెక్టుల్లో శ్రీరాం సాగర్ ప్రాజెక్టు ఒకటి. ఈ ప్రాజెక్టు స్టోరేజ్ కెపాసిటీ తొంభై టీఎంసీలు. ఈ ప్రాజెక్టు ఐదు ఉమ్మడి జిల్లాలకు సాగు, తాగు నీటి అవసరాలు తీరుస్తోంది.


కాళేశ్వరం నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా ఈ ప్రాజెక్ట్ లోకి నీటిని తరలించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఎస్సార్ ఎస్పీ పునరుజ్జీవ పథకానికి శ్రీకారం చుట్టింది. దీంతో శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు మరింత ప్రయారిటీ పెరిగింది. ఇంత కీలకమైన భారీ సాగు నీటి ప్రాజెక్టుకు సరైన భద్రత కల్పించకపోవడం పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న భద్రతకు రెండింతలు పెంచి ఈ భవిష్యత్తులో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైనే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: