దేశంలో పులులు సంఖ్య పెరుగుతోందని ఇటివలే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వీటిని కాపాడుకోవాలని ప్రభుత్వం ‘ప్రాజెక్ట్ టైగర్’, ‘టైగర్ కారిడార్’ వంటి ప్రాజెక్టులు నిర్వహిస్తోంది. ఏపీలో పులులు ఎక్కువగా ఉన్నాయని కేంద్రం గణాంకాలు కూడా విడుదల చేసింది. రాష్ట్రంలో ఇప్పటివరకూ పులుల సంచారం నల్లమల అడవిలోనే ఉండేదని భావిస్తుంటే.. తాజాగా తిరుమల చుట్టూ విస్తరించి ఉన్న శేషాచలం అడవుల్లోనూ కనిపించిన పులుల సంచారం విస్తుగొలుపుతోంది. దాదాపు 30ఏళ్ల తర్వాత శేషాచలం అడవుల్లో పులులు సంచరించడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

 


ఇటివల విడుదల చసిన గణాంకాల్లో నల్లమలలో 40 వరకూ పెద్ద పులులున్నట్టు అధికారులు ప్రకటించారు. శేషాచలంలో వీటి జాడ లేదనే అనుకున్నారు. ఇక్కడ వేలాది హెక్టార్లలో విస్తరించిన ఉన్న దట్టమైన అడవుల్లో అనేక జాతుల జంతువులు, ఎర్రచందనం చెట్లు ఉన్నాయి. ఈ అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ ఎక్కువ. వీరిని అరికట్టడం అటవీ అధికారులకు, టాస్క ఫోర్స్ అధికారులకు సవాల్ గా మారింది. వీరి కదలికల కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో పెద్ద పులలు గుంపులుగా సంచారం చేయడం రికార్డవడంతో అటవీ అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. పులుల సంచారం ఎక్కువగా ఒకచోట ఉండదు. ఆహారం కోసం దట్టమైన ప్రాంతాల్లో సంచరిస్తూంటాయి. దీంతో.. పెద్ద పులులు నల్లమల అడవుల నుంచే వచ్చాయా.. లేక ఇప్పటి వరకూ వీటి జాడ అధికారులకు తెలీలేదా అనేది తేలాల్సిన అంశం.

 

 

అయితే.. దీనిపై అటవీ అధికారులు స్పష్టత కోసం మరిన్ని కెమెరాలతో వీటి జాడ కోసం ప్రయత్నిస్తున్నారు. పులుల సంచారం విషయం తెలిస్తే వాటి జాతికే ప్రమాదమని కూడా అటవీ అధికారులు భావిస్తున్నట్టు సమాచారం. ఇప్పటి వరకూ ఎర్రచందనం కోసమే వచ్చే స్మగ్లర్లు ఇకపై పులుల వేట కోసం వస్తే పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: