రోజుకో ఆర్థిక మోసం వెలుగులోకి వస్తున్నా, జనాలు మారడం లేదు. జనాల అత్యాశ ఆసరగా చేసుకొని కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. తాజాగా విశాఖపట్నంలో ఓ ఆర్థిక మోసం వెలుగులోకి వచ్చింది. ఒక్కసారి డిపాజిట్ చేయండి, నెలనెలా డబ్బులతో పాటు బంగారు నాణేలు కూడా తీసుకెళ్లండి అంటూ ఊదరగొట్టాడు. దీంతో జనం వేలంవెర్రిగా డబ్బులు సమర్పించుకున్నారు. రెండ్రోజుల క్రితం గుర్గావ్ కు చెందిన ఓ ముఠా విశాఖల దిగింది. తమది మెండోలీల్ జ్యూయలరీ లిమిటెడ్ కంపెనీ అని పరిచయం చేసుకున్నారు.


ఒక్కసారి పదకొండు వేల రూపాయల డిపాజిట్ చేస్తే నెలనెలా ఐదు వందల యాభై రూపాయలతో పాటు ఓ గోల్డ్ కాయిన్ కూడా ఇస్తామని ఆశపెట్టారు. ఒక్కసారి డిపాజిట్ చేస్తే ఏళ్ల తరబడి సంపాదించుకోవచ్చని ఆశ చూపారు. దీంతో జనం ఎగబడ్డారు. వేలాది రూపాయల డబ్బులు ఈ ముఠాకు సమర్పించుకున్నారు. మెండోలీల్ జ్యూయలరీ కంపెనీ అని చెప్పుకునే ఈ ముఠాకు కనీసం ఆఫీస్ కూడా లేదు. విశాఖలోని దొండపర్తిలో ఓ హోటల్లో దిగి అక్కడే డిపాజిట్ దారులను పిలిపించుకున్నారు. హోటల్ రూమ్ కు జనం తరలి వస్తుండటంతో అనుమానం వచ్చిన హోటల్ యాజమాన్యం విషయాన్ని పోలీసులకు చేరవేశారు


రంగంలోకి దిగిన పోలీసులు ముఠా గుట్టు రట్టు చేశారు. పోలీసులు రావడాన్ని గమనించిన ముఠా నాయకుడు తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అయితే పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ముఠా దగ్గర నుంచి ఏడు లక్షల నలభై వేల నగదు రెండు వందల బంగారు నాణ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డబ్బులతో పాటు బంగారు నాణ్యాలను కూడా ఇస్తామని ఆశచూపిన ముఠా వ్యవహారంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరుపుతున్నారు. బంగారు నాణ్యాలకు సంబంధించి కస్టమ్స్ అధికారులు కూడా దర్యాప్తు ప్రారంభించారు. డిపోజిట్ తో పాటు ఆ డిపాజిట్ కు జీఎస్టీ సైతం జనాలు నుంచే వసూలు చేయడం విశేషం. గుర్గావ్ ముఠాకు సహకరించిన నలుగురు విశాఖవాసుల్ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: