దశాబ్దాలుగా రాయలసీమ వాసుల కల జగన్మోహన్ రెడ్డి హయాంలో తీరబోతోంది. కర్నూలుకు హై కోర్టును తరలించాలని జగన్ నిర్ణయించినట్లు పార్టీలో ఓ టాక్ వినబడుతోంది. రాజధాని అంటే అసెంబ్లీ, సచివాలయం, రాజ్ భవన్, హై కోర్టు కే కీలకమన్న విషయం తెలిసిందే.

 

అయితే రాష్ట్ర విభజన తర్వాత శివరామకృష్ణన్ కమిటి మాత్రం రాజధాని పేరుతో మొత్తం అభివృద్ధినంతా ఒకేచోట కేంద్రీకరించవద్దంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. హైదరాబాద్ విషయంలో ఒకసారి చేసిన తప్పు మళ్ళీ చేయొద్దంటూ తీవ్రంగానే హెచ్చరించింది. కమిటి చెప్పినా చంద్రబాబునాయుడు పట్టించుకోలేదు.


చేసిన తప్పునే మళ్ళీ చేయటానికి చంద్రబాబు రెడీ అయిపోయారు. చెప్పటమేమో అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తున్నానని చెబుతూనే మళ్ళీ కీలకమైన అభివృద్ధంతా అమరావతిలోనే కేంద్రీకరించారు. అందుకనే ఇటు ఉత్తరాంధ్రలోను, అటు రాయలసీమలోను అలజడులు రేగాయి. అయినా చంద్రబాబు లెక్క చేయలేదు.

 

ఈ పరిస్ధితులు సిఎం అయిన జగన్ మాత్రం చంద్రబాబు చేసిన తప్పును చేయాలని అనుకోవటం లేదనే టాక్ వినిపిస్తోంది. ప్రధానంగా హై కోర్టును కర్నూలుకు తరలించాలని డిసైడ్ అయ్యారట. అంటే రాజధానిలో అసెంబ్లీ, సచివాలయం, రాజ్ భవన్ మాత్రమే ఉండబోతోందన్నమాట. విజయవాడలో హై కోర్టు పెట్టినపుడు కూడా కర్నూలులో పెద్ద ఆందోళనే జరిగింది.

 

శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం  హై కోర్టును  ఇప్పటికైనా కర్నూలులో ఏర్పాటు చేయాలని లాయర్లు పెద్ద ఆందోళనే చేశారు. అయినా చంద్రబాబు లెక్క చేయలేదు. విచిత్రమేమిటంటే అప్పటకి మిత్రపక్షమే అయినా బిజెపి డిమాండ్ ను కూడా పట్టించుకోలేదు. మొత్తానికి కారణాలు ఏమైనా తాజాగా జగన్ నిర్ణయం అంటూ జరుగుతున్న ఓ ప్రచారం నిజమే అయితే మాత్రం రాయలసీమ వాసుల దశాబ్దాలకల నెరవేరినట్లే అని చెప్పుకోవాలి.

 

హై కోర్టును కర్నూలుకు తరలించటంతో కొన్ని విభాగాల కీలకమైన హెడ్ క్వార్టర్స్ ను కూడా ఇతర ప్రాంతాలకు తరలించాలని జగన్ అనుకుంటున్నారట. మొత్తానికి రాజధాని పేరుతో అధికారం మొత్తాన్ని ఒకేచోట కేంద్రీకృతం అయితే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఆందోళనలు రేగే అవకాశం ఉంది.  చంద్రబాబు హయాంలో అలాంటి ఆందోళనలు జరిగినాయి కూడా. అందుకనే ముందుజాగ్రత్తగా మళ్ళీ అటువంటి ఆందోళనలు లేవకుండా జగన్ జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం.

 


మరింత సమాచారం తెలుసుకోండి: