తి పక్షం పోరుతో కొంత కాలంగా దూరంగా ఉన్న నందికొట్కూర్ ఎమ్మెల్యే ఆర్ధర్, బైరెడ్డి సిద్ధార్థరెడ్డిలు ఎప్పుడు కలవనున్నారు. వైసీపీ అధినేత సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆ ఇద్దరికీ ఏమని దిశానిర్ధేశం చేశారు. పార్టీ మారతారనే ప్రచారంపై బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఎలాంటి క్లారిటీ ఇచ్చారు. ఒరుపు కొరుస్తారు గానీ తడుపు కొరవరు అన్నట్టుగా ఉందట నందికొట్కూర్ ఎమ్మెల్యే ఆర్ధర్, బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మధ్య కొనసాగుతున్న తగువు. కర్నూలు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఎంగ్ ఫైర్ బ్రాండ్ గా ఉన్న బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కొంతకాలంగా సైలెంట్ గా ఉన్నారు. పార్టీ కార్యక్రమాలకు కూడా ఆయన దూరంగా ఉంటున్నారు. అందుకు స్థానిక ఎమ్మెల్యే ఆర్ధర్ తో సిద్దార్థరెడ్డికి నెలకొన్న విభేదాలే కారణమని అందరూ అనుకుంటున్నారు.


ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెబుతారని ప్రచారం కూడా నియోజకవర్గంలో బాగా ఊపందుకుంది. ఈనేపధ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి వారిద్దరినీ తన దగ్గర పిలిపించుకున్నారట. ఇద్దరూ కలిసి పనిచేయాలని చెప్పారట. వచ్చే స్థానిక ఎన్నికలపై దృష్టి సారించాలని సీఎం వారికి దిశానిర్ధేశం చేశారట. ముఖ్యమంత్రి జగన్ ను కలిశాక కూడా ఆర్ధర్ బైరెడ్డి, సిద్ధార్థరెడ్డి లు కలవకుండా ఎవరి పనుల్లో వారు ఉన్నారు. అంతేగాక వారిద్దరి మధ్య విబేధాలు మరింత ఎక్కువయ్యాయని కేడర్ లో చర్చ జరుగుతోంది.


ఈ క్రమం లోనే బైరెడ్డి, సిద్ధార్థరెడ్డి మౌనం వీడారు. తాను పార్టీ మారతానని వస్తున్న ప్రచారం వాస్తవం కాదని జీవితాంతం జగనన్నతోనే ప్రయాణం చేస్తానని ఆయన చెప్పారు. నందికొట్కూరు నియోజక వర్గంలో రాజకీయ పెత్తనం కోసమో లేక పదవుల కోసమో తాను సైలెంట్ అవ్వలేదని తనకెలాంటి పదవులు అవసరం లేదని బైరెడ్డి సిద్ధార్థరెడ్డి స్పష్టం చేశారు. త్వరలోనే నందికొట్కూరులో సుమారు ఇరవై వేల మంది కార్యకర్తలతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి తన సత్తా ఏమిటో చూపించాలన్న యోచనలో సిద్ధార్ధరెడ్డి ఉన్నారని సమాచారం.



కార్యకర్తల అభిప్రాయాలతో పాటు వారి మనోభావాలు తెలుసుకుని ముఖ్యమంత్రి వైయస్ జగన్ దృష్టికి తీసుకెళుతానని ఆయన సన్నిహితులతో అంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు నందికొట్కూరులో త్వరలో జరగబోయే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభలో ఎమ్మెల్యే ఆర్ధర్, బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఇద్దరూ కలిసే అవకాశాలున్నాయని నియోజకర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అభిప్రాయపడుతోంది. మరి సభ తర్వాతైనా పార్టీ అధినేత వైయస్ జగన్ చెప్పినట్లు వారిద్దరూ కలిసి అడుగులు వేస్తార లేక మునుపటిలాగే ఎడముఖం పెడ ముఖంగా ఉంటారా అన్న విషయం తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: