ఏపీ బీజేపీ అధినేత క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ కేంద్రంగా ఏపీ వ్య‌వహారాల‌ను చూస్తున్న బీజేపీ నేత‌లు రెండుగా చీలిపోయారా? ఏపీ విష‌యంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని ఇటీవ‌ల కాలంలో ఇరుకున పెడుతున్న క‌న్నాను కొంద‌రు స‌మ‌ర్ధిస్తుంటే.. మ‌రికొంద‌రు త‌ప్పుబ‌డు తున్నారా?  మొత్తానికి ఈ విష‌యం ఇప్పుడు పార్టీలోనూ.. మేధావి వ‌ర్గంలోనూ.. బీజేపీ సానుభూతి ప‌రుల్లోనూ చ‌ర్చ‌నీయాంశం గా మారిందా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. విష‌యంలోకి వెళ్తే.. ఈ ఏడాది జ‌రిగిన అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో ఒక్క సీటును కూడా కైవ‌సం చేసుకోలేక పోయిన బీజేపీలో లుక‌లుక‌లు ప్రారంభ‌మ‌య్యాయి. క‌న్నా విఫ‌ల‌మ‌య్యాడ‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. అదేస‌మ‌యంలో ఆయ‌న ఏ ఒక్క‌రినీ గెలిపించుకోలేక పోయాడు, ఆయ‌న అనుభ‌వం బీజేపీకి ప‌నికిరాద‌నే వాదన కూడా ఉంది. 


స‌రే ఎన్నిక‌ల్లో ఓట‌మి, ఒక్క‌సీటును కూడా కైవ‌సం చేసుకోలేని కార‌ణంగా ఇలాంటి వ్యాఖ్య‌లు, విమ‌ర్శ‌లు స‌హ‌జంగానే వినిపిస్తాయి. వీటిని పెద్ద‌గా ప‌ట్టించుకోవాల్సిన ప‌నిలేదు. పైగా అధ్య‌క్ష పీఠం కోసం ఎదురు చూసిన నిరాశ‌కు గురైన నాయ‌కులు కూడా ఇలాంటి వ్యాఖ్య‌ల‌ను ప్ర‌చారం చేస్తుంటారు. వీటిని కూడా పెద్ద‌గా ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. అయితే, దీనికి భిన్నంగా ఇప్పుడు ఏపీ బీజేపీలో కూట‌మి రాజ‌కీయాలు జ‌రుగుతున్నాయి. మేధావి వ‌ర్గంగా పేర్కొనే మాజీ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, అధికారులు ఒక వ‌ర్గంగా రాజ‌కీయ నేత‌లు, వ్యాపార వ‌ర్గాలు ఒక వ‌ర్గంగా మారిపోయారు. వీరిలో ఓ వ‌ర్గం క‌న్నాను తీవ్ర‌స్థాయిలో త‌ప్పుబ‌డుతోంది. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. ఆయ‌న బీజేపీ లైన్ త‌ప్పుతున్నారే!!


 హైదరాబాద్ లోని బీజేపీ  కార్యాలయంలో పార్టీ నేతలు మాజీ సీఎస్‌ ఐవైఆర్ క్రిష్ణారావు, మాజీ డీజీపీ దినేష్ రెడ్డి, సుధీష్ రాంబొట్ల, మాజీ ఐఏయస్ దాసరి శ్రీనివాసులు సహా మరి కొంత మంది హాజరయ్యారు. ఈ సంద‌ర్భంగా వీరంతా క‌న్నాపై వ్యాఖ్య‌లు చేశారు. రాజధాని విషయంలో అవినీతి జరిగిందని బీజేపీ అధినాయకత్వం మొదలు రాష్ట్ర నేతలు వరకు అందరూ విమర్శిస్తుంటే.. ఇప్పుడు అదే రాజధాని విషయంలో ఏకపక్షంగా ఎలా వ్యవహరిస్తారని వారు ప్రశ్నించినట్లు సమాచారం. ఇక, పోలవరం విషయంలోనూ టీడీపీ స్పందిస్తున్న విధంగానే బీజేపీలోని కొందరు ఫాలో అవుతున్నారని..బీజేపీ వైఖరి ఏంటనేది పార్టీ నేతలతో చర్చించటం లేదనేది వారి ప్ర‌ధాన ప్ర‌శ్న‌గా మారింది. 


అంతేకాదు, వీరు ఢిల్లీ వెళ్లి జాతీయ నేతలను కలవాలని నిర్ణయించారు. అంతర్గతంగా రాజధాని ప్రాంతంలో బీజేపీ నేతల పర్యట న.. అక్కడ టీడీపీ నేతలతో కలిసి పర్యటన చేయటం పైన వీరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇలా కన్నా మీద ఒక వ‌ర్గం నేతలు ఆగ్రహంతో ఉండటం, ఇప్పుడు ఈ వ్యవహారాన్ని ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదు చేయాలని భావిస్తుండటం రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌నీ యాంశంగా మారింది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి! ఏదేమైనా .. రాష్ట్రంలో బీజేపీ నాయ‌కుల‌ను క‌న్నా స‌రైన దిశ‌లో న‌డిపించ‌డం లేద‌నే వ్యాఖ్య‌లు మాత్రం అన్ని ప‌క్షాల నుంచి వినిపిస్తున్నాయి. మ‌రి దీనిపై అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: