టీడీపి యువనేత నారా లోకేష్ కు యనమల క్లాస్ తీసుకున్నారా.? ప్రతిపక్షంలో ఎలా ఉండాలి, నాయకుడిగా ఎలా ఎదగాలో యువనేతకి పెద్దాయన గైడ్ చేశారా.? లోకేష్ కు యనమల చెప్పిన పాఠం ఏంటి, ఆ అవసరం ఎందుకొచ్చింది. అసలు లీడర్ లు లోకేష్ పరంగా ఏం కోరుకుంటున్నారు. అసలు లోకేష్ కు ఆయన తండ్రికి అత్యంత సన్నిహితుడైన యనమల ఏం చెప్పారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై పార్టీలో విస్తృత చర్చ జరుగుతోంది. టిడిపి ప్రతిపక్షానికి పరిమితమైన తరుణంలో లోకేష్ ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి అనే అంశంపై ఫోకస్ పెరిగింది. అధికారంలో ఉన్న సమయంలో కేడర్ కు లీడర్ లకు అంతగా దగ్గర కాలేక పోయిన లోకేశ్ ఇప్పుడు ఎలా వ్యవహరించాలి అనే దానిపై ఎవరి అంచనాలు వారికున్నాయి.


అయితే ప్రస్తుతం లోకేష్ అనుసరిస్తున్న వైఖరిపై చాలా మంది నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మాజీ సీఎం కుమారుడిగా యువనేతగా లోకేశ్ మరింత దూకుడుగా ఉండాలని వారు కోరుకుంటున్నారు. ముఖ్యంగా ప్రజా సమస్యలపై పార్టీ నేతలతో కలిసి లోకేష్ ఉద్యమించాలని నేతలు ఆశిస్తున్నారు. అధికారంలో ఉన్న సమయంలో చేసిన తప్పులను తెలుసుకొని పార్టీ ఏంటి లాయల్ గా ఉండే నేతలు ఎవరు, వారి అవసరాలు ఏంటీ వంటి అంశాల పై లోతుగా వెళ్లాలని పార్టీ నేతలు కోరుకుంటున్నారు. రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓటమి తర్వాత టిడిపి శ్రేణులు తీవ్ర నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోయాయి. కేవలం ఇరవై మూడు సీట్లు మాత్రమే రావడంతో పార్టీ అగ్రనాయకులు నుంచి కింది స్థాయి క్యాడర్ వరకు అందరిలో నైరాశ్యం కనిపిస్తోంది.


దీంతో పార్టీలో ఉత్సాహం నింపేందుకు ఫలితాలు వచ్చిన వారం నుంచే చంద్రబాబు పని మొదలు పెట్టారు. నేతలతో భేటీలు సమావేశాలు చర్చలతో పార్టీ యాక్టివిటీస్ వైపు నేతలను నడిపించారు. అదే సమయంలో లోకేష్ కూడా యాక్టివ్ కావాలని నేతలు కోరుకుంటున్నారు. గతంలో మంత్రిగా ఉన్న సమయంలో లోకేష్ పక్కన ఉన్న బ్యాచ్ ఇప్పుడు లేదు. ఈ విషయంలో పార్టీ శ్రేణులు ఆశించిన మార్పు కొంత కనిపిస్తుంది. అలాగే లోకేష్ ఇప్పుడు పూర్తిగా నేతలతో కార్యకర్తలతో కలవాలని వారు కోరుకుంటున్నారు. అయితే లోకేష్ గదిలో కూర్చుని ట్వీట్లు చేయడం పై పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తి ఉంది. ఈ విషయాన్ని అధినేతకు గానీ, లోకేశ్ కు గానీ ఎవరూ చెప్పే ధైర్యం చేయడం లేదు. ఆ క్రమంలో పార్టీలో నెంబర్ టూ గా అంతా భావించే యనమల ఈ విషయంలో రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: