జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గ్రామ సచివాలయం కాన్సెప్టును అమలు చేసేందుకు సంకల్పించిన సచివాలయ ఉద్యోగాల నియామకాల ప్రక్రియలో నేటి నుంచి కీలక ఘట్టం జరగనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 1,26,728 ఉద్యోగాల నియామకానికి నేటి నుంచి రాత పరీక్షలు నిర్వహించ బోతున్నారు. ఈ ఉద్యోగాల కోసం 21,69,719 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు.


ఈ సచివాలయ ఉద్యోగాల్లో మొత్తం 19 రకాలు ఉద్యోగాలు ఉన్నాయి. వీటి కోసం మొత్తం 14 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షల కోసం ఏపీ రాష్ట్రవ్యాప్తంగా 5,314 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. సెప్టెంబరు 1, 3, 4, 6, 7, 8 తేదీల్లో పరీక్షలు జరుగుతాయి. ఇవి ఉదయం, మధ్యాహ్నం జరగుతాయి.


ఇక పరీక్షల సమయాల విషయానికి వస్తే.. ఉదయం 10 నుంచి 12.30 వరకు ఒక పరీక్ష... మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకూ పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్షలకు హాజయ్యే అభ్యర్థులు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. మిగిలిన చాలా పరీక్షల్లానే ఈ పరీక్షలకు ఒక్క నిమిషం నిబంధన ఉంది. నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని అధికారులు ముందుగానే హెచ్చరించేశారు.


ఇక పరీక్షలకు వెళ్లేవారు హాల్ టికెట్ తో పాటు ఏదైనా గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకెళ్లాలి. ఆధార్ కార్డు ఉంటే బెటర్. పరీక్ష కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు, వీడియో చిత్రీకరణ ద్వారా నిఘా ఏర్పాటు చేశారు. ఈ పరీక్షల నిర్వహణ కోసం తాడేపల్లిలోని ప్రధాన కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. అంతే కాదు.. ఈ పరీక్షకు సంబంధించి ఏమైనా ఫిర్యాదులంటే.. విజ్ఞప్తులు ఉంటే.. వాటి పరిష్కారం కోసం ప్రత్యేకంగా కాల్‌ సెంటర్ ఏర్పాటు చేశారు అధికారులు. అభ్యర్థులు ఏమైనా సమస్య ఉంటే.. 91912 96051, 91912 96052, 91912 96053, 91912 96054, 91912 96055 ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి తమ సమస్యలు చెప్పుకోవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: