తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్‌లో అస‌మ్మ‌తి గ‌ళాలు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి. మొన్న ఈటల రాజేందర్ తనను పార్టీలో అవమానిస్తున్నారని…. మంత్రి పదవి నుంచి తొలగిస్తారనే ప్రచారం మొదలు పెట్టారని కార్యకర్తల సమక్షంలో తన ఆవేదన వెళ్లగక్కారు. ఇక మాజీ డిప్యూటీ సీఎం క‌డియం శ్రీహ‌రి కూడా పైకి చెప్పుకోక‌పోయినా కేసీఆర్‌పై అసంతృప్తితోనే ఉంటున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. తాజాగా టీఆర్ఎస్ లో మరో తిరుగుబాటుకు నాంది పలికారు కాగజ్ నగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప.


కోనేరు కోన‌ప్ప జిల్లా జ‌డ్పీ స‌ర్వ‌స‌భ్య స‌మావేశాన్ని బ‌హిష్క‌రించారు. ఆయ‌న సిర్పూర్ కాగ‌జ్‌న‌గ‌ర్ నుంచి వ‌రుస‌గా రెండోసారి ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు. ఎమ్మెల్యే కోనేరు కోనప్పతోపాటు ఆయన అనుయాయులైన ఏడుగురు జడ్పీటీసీలు, ఏడుగురు ఎంపీపీలు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని బహిష్కరించడం తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల్లో తీవ్ర క‌ల‌క‌లం రేపింది. ఇందుకు ఓ కార‌ణం కూడా ఉంది. కొద్ది రోజుల క్రితం కోనేరు కోన‌ప్ప త‌మ్ముడు కోనేరు కృష్ణ అట‌వీశాఖ అధికారుల‌పై దాడి చేశార‌న్న కార‌ణంతో ప్ర‌భుత్వం చాలా క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించింది.


ఆయ‌న ఈ కేసులో జైలులో కూడా ఉండాల్సి వ‌చ్చింది. చివ‌ర‌కు ఆ ఘ‌ట‌న జ‌రిగిన వెంట‌నే కృష్ణ త‌న జ‌డ్పీటీసీతో పాటు జ‌డ్పీ వైస్‌చైర్మ‌న్ ప‌ద‌వికి కూడా రాజీనామా చేశారు. పార్టీ కూడా ఆయ‌న్ను స‌స్పెండ్ చేసింది. కేసీఆర్ ఈ విష‌యంపై తీవ్ర‌మైన ఆగ్ర‌హంతో ఊగిపోయారు. ఇక త‌న త‌మ్ముడి విష‌యంలో పార్టీ వ్య‌వ‌హ‌రించిన తీరుతో మ‌న‌స్థాపానికి గురైన కోన‌ప్ప ఇప్పుడు జ‌డ్పీ స‌ర్వ‌స‌భ్య స‌మావేశానికి డుమ్మా కొట్ట‌డం షాకింగ్‌గా మారింది.


2014 ఎన్నిక‌ల్లో బీఎస్పీ పార్టీ నుంచి టీఆర్ఎస్ లో చేరాడు కోనేరు కోనప్ప. మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అనుంగ అనుచరుడు. ఆయన అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ఇప్పుడు గైర్హాజరవడం చూస్తే కోనప్ప టీఆర్ఎస్ కు దూరంగా జరుగుతున్నట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మ‌రి ఈ వివాదంలో మంత్రి జోక్యం చేసుకుని ఎలా ప‌రిష్క‌రిస్తారో ?  చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: