గ‌త కొద్దికాలంగా జ‌రుగుతున్న చ‌ర్చ‌కు తెర‌దించుతూ....కేంద్ర ప్రభుత్వం ఐదు రాష్ర్టాలకు కొత్త గవర్నర్‌లను నియమించింది. తెలంగాణకు తమిళనాడుకు చెందిన బీజేపీ మహిళా నాయకురాలు తమిళిసై సౌందరరాజన్ గవర్నర్‌గా నియమితులు కాగా, మహారాష్ట్ర గవర్నర్‌గా భగత్‌సింగ్ కశ్యారీ, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా తెలంగాణకు చెందిన కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, రాజస్థాన్ గవర్నర్‌గా కల్రాజ్ మిశ్రా, కేరళ గవర్నర్‌గా ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ నియమితులయ్యారు.


తమిళిసై సౌందరరాజన్ వ్య‌క్తిగ‌త వివ‌రాలివి....ఇప్పటివరకు తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్నారు. ఆమె వృత్తి రీత్యా వైద్యులు. కన్యాకుమారి జిల్లా నాగర్ కోయిల్‌లో జూన్ 2, 1961లో ఆమె జన్మించారు. ఆమె మద్రాస్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదివారు. గతంలో ఆమె బీజేపీ జాతీయ కార్యదర్శిగా కూడా పని చేశారు. 2006, 2011 అసెంబ్లీ ఎన్నికల్లో, 2009, 2019 సంవత్సరాల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.


తమిళనాడు బీజేపీ చీఫ్ తమిళిసై సౌందరరాజన్ త‌న తాజా నియ‌మ‌కంపై స్పందిస్తూ...తెలంగాణకు గవర్నర్ అవడం సంతోషంగా ఉందన్నారు. ఓ మీడియా సంస్థ‌తో మాట్లాడుతూ ``తెలుగు వారందరికీ నమస్కారం`` అంటూ.. తెలుగులో పలకరించారు. తెలంగాణలోని అక్కచెల్లెళ్లు, అన్నదమ్ములను త్వరలోనే పలకరిస్తానని చెప్పారు. వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పారు. దేశసేవ చేసేందుకు తనకు అవకాశమిచ్చిన ప్రధాని మోడీ, పార్టీ చీఫ్ అమిత్ షాకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. సాధారణ కార్యకర్తగా పార్టీలోకి వచ్చిన తనకు గవర్నర్ గా బాధ్యతలివ్వడం.. గొప్ప గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. గవర్నర్ గా నియమితులైన తమిళిసాయిని తమిళనాడు బీజేపీ నేతలు సన్మానించారు.


కాగా, తెలంగాణకు నూతన గవర్నర్‌గా నియమితులైన తమిళిసై సౌందర్ రాజన్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా తమిళిసై సౌందర్ రాజన్‌ను సీఎం కేసీఆర్ రాష్ర్టానికి సాదరంగా ఆహ్వానించారు. తమిళిసైతో కేసీఆర్ ఫోన్‌లో మాట్లాడి శుభాకాంక్షలు కూడా తెలిపారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: