సెప్టెంబర్ 2.. వై.ఎస్. వర్ధంతి. సరిగ్గా పదేళ్ల క్రితం ఇదే రోజు.. వైఎస్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. వైఎస్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే అయినా.. ఆయన ఆ ప్రమాదానికి ముందే గుండెపోటుతో మరణించారా.. లేక ప్రమాదం తర్వాత కొద్దిసేపు బ్రతికున్నారా.. లేక ప్రమాదం సమయంలోనే కన్నుమూశారా.. ఈ అనుమానాలను నివృత్తి చేసింది ఆయన పోస్టు మార్టమ్ రిపోర్ట్..


వైఎస్ పోస్టు మార్టం రిపోర్టులో అనేక షాకింగ్ సంగతులు ఉన్నాయి. హెలికాప్టర్ ప్రమాదం జరిగిన కొద్ది నిమిషాల వరకు వై.ఎస్. రాజశేఖర్ రెడ్డితో పాటు హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న ఐదుగురు బతికే ఉన్నారని పోస్టు మార్టం నివేదిక చెప్పింది. తీవ్ర షాక్ కారణంగా వారు కన్ను మూశారని ఫొరెన్సిక్ నిపుణులు తెలిపారు. దుర్ఘటనలో మృతుల శరీర భాగాలు బాగా కాలిపోయినట్లు, కొన్ని నిమిషాలు కొట్టుమిట్టాడి మరణించినట్లు పోస్టుమార్టం నివేదికలో ధ్రువీకరించారు. వైద్య పరిభాషలో ఎమరేజ్ షాక్ అంటారని తెలుస్తోంది.


ప్రమాదం జరిగిన సమయంలో హెలికాప్టర్ నల్లమల పావురాల గుట్ట మీద వాలగానే 120 మీటర్ల దూరం నేల మీద ఈడ్చుకుంటూ వెళ్లిందని సంఘటన స్థలంలో దర్యాప్తు జరిపిన సీబీ సీఐడీ ఫోరెన్సిక్ నిపుణులు వెల్లడించారు. ఆ ధాటికి హెలికాప్టర్ తోక, ఇతర భాగాలు ఒక్కొక్కటే ఊడిపోయాయట. చివరగా హెలికాప్టర్ ఒక చెట్టుకు ఢీకొని పేలిపోయిందని తెలిపారు. పేలుడు తీవ్రతకు హెలికాప్టర్ శకలాలు వేగంగా అన్నిదిక్కులా దూసుకు పోయాయని, అందులో ప్రయాణిస్తున్న అయిదుగురి దేహాలు వాటితోపాటే తలా ఒకవైపు దూసుకుపోయాయని వివరించారు.


హెలికాప్టర్ శకలాలు గుచ్చుకోవడం వల్లే అందులో ప్రయాణిస్తున్న వ్యక్తుల శరీరాలు ఛిద్రమయ్యాయని వెల్లడించారు. హెలికాప్టర్ కూలిన ఘటన ప్రమాదవశాత్తు జరిగిందేనని సీబీసీఐడీ నిర్ధారించింది. సీబీ సీఐడీ బాంబ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ నిఫుణుల విభాగం పేలుడు పదార్థాల అవశేషాల కోసం సంఘటనా స్థలంలో దర్యాప్తు నిర్వహించింది. వారికేమీ ఆధారాలు లభించలేదు. దాంతో ముమ్మాటికీ ఇది ప్రమాదమేనని తేల్చారు. ఏదేమైనా ఆ మహానేత కన్నుమూసి పదేళ్లు దాటినా ఆయన పాలనను జనం ఇంకా గుర్తు చేసుకుంటూనే ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: