ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నిన్న తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయం నుండి మీడియాతో మాట్లాడారు. రాజధాని అమరావతి చుట్టూ భూ కుంభకోణాలు అల్లుకొని ఉన్నాయని బొత్స సత్యనారాయణ ఆరోపణలు చేసారు. సీఆర్డీఏ సమీక్షల ద్వారా ఈ విషయం తెలిసిందని  అన్నారు. ఈ సమీక్షల్లో వెయ్యి కుంభకోణాలు జరిగినట్లు తెలుస్తోందని చెప్పారు. 
 
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిగారు నిర్వహిస్తున్న సమీక్షల్లో అనేక భూకుంభకోణాలు బయటపడుతున్నాయని బొత్స అన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో అభివృధ్ధి చేస్తామని చెప్పారని కానీ దోపిడీ చేసారని అన్నారు. తాత్కాలిక అసెంబ్లీ నిర్మాణం, విద్యుత్ స్తంభాలు, నీటి పైపులైన్ల నిర్మాణం, సింగపూర్ కంపెనీలకు భూములు ఇవ్వటంలో కూడా కుంభకోణం జరిగిందని బొత్స సత్యనారాయణ చెప్పారు. 
 
చంద్రబాబు నివాసమే అతి పెద్ద కుంభకోణమని విమర్శలు చేసారు బొత్స సత్యనారాయణ. వైసీపీ ప్రభుత్వం ఈ కుంభకోణాలపై చర్యలు తీసుకుంటే చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్ తట్టుకోలేరని  అన్నారు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ప్రజలు రాజధానిలో జరిగిన దోపీడీలపై చర్యలు తీసుకోవాలని అనుకొంటున్నారని కానీ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి ఎందుకు వత్తాసు పలుకుతున్నాడో అర్థం కావటం లేదని బొత్స సత్యనారాయణ అన్నారు. 
 
తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించటం లేదని రాజధాని ప్రాంతంలో జరిగిన దోపిడీ గురించి ఎందుకు మాట్లాడలేదని బొత్స సత్యానారాయణ అన్నారు. చంద్రబాబు అవినీతిలో పవన్ కళ్యాణ్ కు భాగస్వామ్యం ఉందని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని  అన్నారు. చంద్రబాబు నాయుడు గారికి అక్రమ నివాస భవనం ఇచ్చింది మరియు పవన్ కళ్యాణ్ నివాసానికి 2 ఎకరాల భూమిని ఇచ్చింది ఒకరేనని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మధ్య ఆర్థిక సంబంధాలు ఉన్నాయని చెప్పటానికి ఇదే సాక్ష్యమని  అన్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు మధ్య ఆర్థిక సంబంధాలే కాక రాజకీయ సంబంధాలు, స్క్రిప్ట్ సంబంధాలు కూడా ఉన్నాయని బొత్స సత్యనారాయణ అన్నారు. 


 
 



మరింత సమాచారం తెలుసుకోండి: