వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూసి నేటికి సరిగ్గా పదేళ్లు.. సరిగ్గా పదేళ్లకే ఆయన కుమారుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఏపీకి సీఎం అయ్యాడు. రాజన్న పాలన మళ్లీ తెస్తానంటూ జగన్ అధికారంలోకి వచ్చారు. మరి జగన్ పాలనపై ఆయన తల్లి ఏమంటున్నారు.. వైఎస్ మరణించిన నేటికి పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఆమె సాక్షి మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు.


జగన్ సీఎంగా ఫెయిల్ అయ్యారంటూ ప్రతిపక్షం చేస్తున్న విమర్శలపై విజయమ్మ స్పందించారు. రాజకీయాలంటే సినిమా కాదని, వంద రోజుల్లో పాలనపై తీర్పు ఇవ్వడం ప్రతిపక్షం తొందరపాటని వైఎస్‌ విజయమ్మ అన్నారు. ప్రజలకు మంచి చేసే విషయంలో దివంగత మహానేత ఒకడుగు ముందుకు వేస్తే జగన్‌ రెండడుగులు ముందుకు వేస్తానంటున్నాడని చెప్పారు. జగన్‌లో ధైర్యం పాళ్లు ఎక్కువని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా మేనిఫెస్టోలో చెప్పిన విషయాలను ఆచరించి చూపుతారని ఆత్మవిశ్వాసంతో పేర్కొన్నారు.


ఎన్నో కష్టనష్టాలకోర్చి అఖండ విజయంతో సీఎం పదవిని అధిష్టించిన వైఎస్‌ జగన్‌.. తండ్రి వైఎస్సార్‌ అడుగుజాడల్లో నడుస్తూ ఏడాదిలోగా మంచి ముఖ్యమంత్రి అని నిరూపించుకుంటారని విజయమ్మ ఆకాంక్షించారు. జగన్‌ అధికారంలోకి వచ్చినందుకు సంతోషంగా ఉంది. 100 రోజుల పాలనను పెద్దగా పరిగణనలోకి తీసుకోలేం. ఇది సినిమా కాదు. ప్రతి రోజు.. ప్రతి నిమిషం ప్రజల కోసం పని చేయాలి. నాన్న ఒకడుగు ముందుకేస్తే తాను రెండడుగులు వేస్తానంటున్నాడు జగన్‌. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, వలంటీర్లకు మేనిఫెస్టోను ముందు పెట్టుకోవాలని చెప్పారు.. అంటున్నారు విజయమ్మ.


జగన్‌లోని ఆ కమిట్‌మెంట్‌ నాకు చాలా నచ్చింది. మళ్లీ ఎన్నికల నాటికి ఈ మేనిఫెస్టోలోని అంశాలు అమలు చేశాకే ఓట్లడుగుతానంటున్నాడు. మద్యపాన నిషేధంలో భాగంగా బెల్ట్‌షాపుల తొలగింపు మొదలుపెట్టారని గుర్తు చేశారు విజయమ్మ.. వైఎస్‌ చెప్పినవన్నీ చేసి చూపించారు. ఆయన రక్తం పంచుకుపుట్టిన జగన్‌ కూడా చేస్తాడు. ఒక అవకాశం ఇవ్వండని కోరాను. ప్రజలు అవకాశం ఇచ్చారు. తొలిరోజే మేనిఫెస్టో గురించి మాట్లాడాడు. ప్రజా సమస్యల పరిష్కారానికి చేపట్టిన స్పందన కార్యక్రమం బాగుంది. ఎన్నిరోజుల్లో సమస్య పరిష్కరిస్తామో చెప్పాలన్నారు. అసెంబ్లీలో చరిత్రాత్మక బిల్లులు ఆమోదించారు అంటూ జగన్ పాలనపై స్పందించారు విజయమ్మ.


మరింత సమాచారం తెలుసుకోండి: