ఇద్దరు మాజీ స్నేహితుల మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. వారిద్దరిలో.. మంత్రి అవంతి శ్రీనివాస్ ఒకరైతే మరొకరు మాజీ మంత్రి గంటా శ్రీనివాస్. ఇద్దరూ ఒకప్పుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో ఎమ్మెల్యేలే. తరువాత టీడీపీలో గంటా రాష్ట్ర మంత్రిగా పనిచేస్తే.. అవంతి ఎంపీగా చేశారు. ఇప్పుడు గంటా టీడీపీలో ఎమ్మెల్యేగా ఉంటే అవంతి వైసీపీలో చేరి మంత్రి అయ్యారు. ప్రస్తుతం వీరిద్దరూ ఉప్పు నిప్పులా ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేలుస్తున్నారు.

 


నిన్న అవంతిని ఉద్దేశించి.. ‘నేను అవంతిని ఒక మంత్రిగా చూడటం లేదు. నేను వైసీపీలో చేరాలనుకుంటే ఎవరూ ఆపలేరు. రాజధానిపై సీఎం మౌనంగా ఉండి.. బొత్స పదేపదే మాట్లాటం తగదు. రాజధానిపై సీఎం జగన్ స్పష్టమైన ప్రకటన చేయాలి. అమరావతిలో రాజధానిని స్వాగతిస్తున్నామని జగన్ అసెంబ్లీలో చెప్పారు. శివరామకృష్ణ కమిటీ ప్రకారమే అమరావతిలో రాజధాని నిర్ణయం జరిగింది. బీసీల మనోభావాలు దెబ్బతినడం వల్లే విజయనగరం జిల్లాలో ఓడిపోయాం. టికెట్ల కేటాయింపులో సమతుల్యత లోపించింది’ అంటూ గంటా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై అవంతి మండిపడ్డారు.

 


‘గంటా చరిత్ర ఏంటో నాకు తెలుసు. నెల్లూరు మెస్‌లో టోకెన్లు అమ్మిన చరిత్ర మర్చిపోయినట్టున్నాడు. గంటా నమ్మిన వారిని మోసం చేసి, కుట్రలు చేసి ఎదిగాడు. టీడీపీలో ఉంటూ తాను వైసీపీలో చేరాలనుకుంటే ఆపేదెవరు అంటూ రాజకీయ వ్యభిచారం చేస్తున్నాడు. గంటాను కనీసం మనిషిగా కూడా చూడను. ఇంకా మంత్రి అనే భ్రమలోనే ఉన్నట్టున్నాడు. విజయనగరం జిల్లా ఇన్‌చార్జిగా ఉండి ఒక్క ఎమ్మెల్యేను గెలిపించలేదు. అదృష్టం బాగుండి స్వల్ప మెజార్టీతో గెలిచినోడు నన్ను అంటాడా.  నేను అయ్యన్నపాత్రుడు అంత మంచివాడిని కాను.. తెలుసుకో! నా జోలికొస్తే.. విశాఖలో ఉండకుండా చేయగలను. మంచివాళ్లనే వైసీపీ చేర్చుకుంటుంది. బ్యాంకు రుణాలు ఎగ్గొట్టే వాళ్లను పార్టీలో చేర్చుకోదు’ అంటూ తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు. ఈ వాగ్యుద్దాలు ఎంతవరకూ దారితీస్తాయోనని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: