వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ, నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా’  గణనాథుడు మిమ్మల్ని అన్నివేళలా దీవించాలంటూ దేశవ్యాప్తంగా విఘ్న వినాయకుడుని శక్తి కొలది పూజించారు. ఈ క్రమంలో ఆ వినాయ‌కుడు ప్రజలందరి  విఘ్నాలను  తొలగించి వారి కుటుంబాల్లో ఎప్పుడు సుఖ‌సంతోషాలు నింపాల‌ని కోరుకుంటూ గవర్నర్, ముఖ్యమంత్రులతో సహా పలు రాజకీయ పార్టీల నాయకులు గణపతిని కొలిచారు. సోమవారం వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్ శ్రీ ద్వాదశాదిత్యుడి తొలిపూజలో గవర్నర్ నరసింహన్ దంపతులు పాల్గొన్నారు. ప్రత్యేక పూజల అనంతరం గవర్నర్ మాట్లాడుతూ..తెలంగాణ రాష్ర్టానికి ఖైరతాబాద్ గణేశుడు  తలమానికంగా నిలుస్తాడని గవర్నర్ నరసింహన్ అన్నారు. ఖైరతాబాద్ గణేష్ పూజ తెలంగాణకు ఎంతో ప్రత్యేకమైనదన్నారు. గత 9 సంవత్సరాలుగా ప్రతి ఏడాది ఇక్కడికి రావడం అలవాటుగా అయిపోయిందన్నారు.





ఈ గణేశుడిని పూజిస్తే తెలంగాణకు ఎప్పుడు కూడా ఏ విఘ్నం రాదు అని తన నమ్మకమని గవర్నర్ నరసింహన్ స్పష్టం చేశారు. ఈ విఘ్నేశ్వరుడి ఆశీర్వాదంతో ఈ రాష్ట్రం బంగారు తెలంగాణ కావాలని ప్రార్థిస్తున్నానని గవర్నర్ తెలిపారు.ఈ గణపతి పూజలో గవర్నర్ పాటుగా  మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.  ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితితో పాటు మంత్రి తలసాని, ఎమ్మెల్యే దానం గవర్నర్ దంపతులను శాలువాతో సత్కరించి సన్మానించారు. ఇక ఖైరతాబాద్ మహాగణపతికి 80 అడుగుల వెండి హారాన్ని ఎమ్మెల్యే దానం నాగేందర్ సమర్పించారు.ప్రగతి భవన్‌లో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. అక్కడ మట్టి గణేష్ ప్రతిమను ప్రతిష్టించి ప్రత్యేక పూజలు చేశారు అర్చకులు. 




ఈ పూజల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర రావు  దంపతులు, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దంపతులు, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్, కేటీఆర్ కుమారుడు హిమాన్షుతో పాటు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. పూజానంతరం గణపతి పూజ ఫోటోలను కేటీఆర్ తన ట్విట్టర్ లో పోస్టు చేశారు. ఇదిలా ఉండగా వినాయక నవరాత్రులలో ఆయా మండపాల నిర్వాహకులు విద్యుత్‌ తో అప్రమత్తతతో వ్యవహరించాలని  టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ అధికారులు కోరుతున్నారు. మండపాల వద్ద తాత్కాళికంగా ఏర్పాటు చేసుకునే విద్యుత్ తీగల వల్ల అనేక ప్రమాదాలు జరిగే అస్కారముందని, కనుక అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. పూర్తిగా నివాస ప్రాంతాల్లో ఏర్పాటు చేసే మండపాల్లో షార్ట్ సర్క్యూట్‌లు, విద్యుత్‌షాక్ తగిలితే ఆస్తి, ప్రాణనష్టం జరిగే అవకాశమున్నందున నిర్లక్ష్యంగా వ్యవహరించరాదంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: