మొద‌టి రోజే.. మోటార్ వాహ‌నాల నూత‌న చ‌ట్టం-2019 త‌డాఖా చూపించింది. ఈ చ‌ట్టం ప‌వ‌రేమిటో తొలిరోజే అంద‌రికీ తెలిసిపోయింది. ఇక నుంచి ట్రాఫిక్ నిబంధ‌న‌లు అతిక్ర‌మిస్తే.. భారీ స్థాయిలో వాయింపులు ఉంటాయ‌ని జ‌రిగిన ప్ర‌చార‌మే.. ఇప్పుడు నిజ‌మైంది. దీంతో వాహ‌న‌దారులు బెంబేలెత్తిపోతున్నారు. 


ట్రాఫిక్ పోలీసులు కొర‌డా ఝులిపించిన తీరుచూస్తే.. ముందుముందు ప‌రిస్థితులు ఎలా ఉంటాయో సుల‌భంగా అర్థం చేసుకోవ‌చ్చు. మోటార్ వాహనాల నూతన చట్టం-2019 అమలులోకి వచ్చిన తొలి రోజు సెప్టెంబ‌ర్ ఒక‌టో తేదీనే  దేశ‌వ్యాప్తంగా భారీ స్థాయిలో ఛ‌లాన్లు విధించారు.


నిబంధనలు అతిక్రమించిన వారిపై ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝులిపించారు. దేశ రాజధాని అయిన ఢిల్లీ నగరంలో వివిధ నిబంధనల కింద ఒక్క రోజులోనే 3,900 ఛలాన్లు జారీ అయ్యాయి. ఈ లెక్క‌చాలు నూత‌న చ‌ట్టం ప‌వ‌రేమిటో తెలియ‌డానికని వాహ‌న‌దారులు బెంబేలెత్తిపోతున్నారు. 


మ‌రొక విష‌యం ఏమిటంటే.. మోటార్ వాహ‌నాల నూత‌న చ‌ట్టం-2019 ఇంకా ప‌లు రాష్ట్రాల్లో అమ‌ల్లోకి రాలేదు. ఆయా రాష్ట్రాల ప్ర‌భుత్వాలు అనుమ‌తి ఇస్తేనే.. ఈ నూత‌న చ‌ట్టం అమ‌లులోకి వ‌స్తుంది.


ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప్ర‌జ‌ల స్పంద‌న‌ను బ‌ట్టి అమ‌లు చేసే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. సోష‌ల్ మీడియాలో నూత‌న చ‌ట్టం-2019 నిబంధ‌న‌లు వైర‌ల్ అయ్యాయి. ఇదే స‌మ‌యంలో ప్ర‌భుత్వాల‌పై కూడా తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. 


ఒక్క‌రోడ్డు అయినా స‌రిగ్గా ఉండ‌దు..కానీ.. ఈ స్థాయిలో ట్రాఫిక్ రూల్స్‌పేరిట వ‌సూలు చేస్తారా.. అంటూ విమ‌ర్శ‌లు కూడా వ‌స్తున్నాయి. డ్రైవింగ్ లైసెన్స్ సహా, ట్రాఫిక్ నిబంధనలను కఠినతరం చేస్తూ.. మోటార్ వాహనాల చట్టంలో చేసిన స‌వ‌ర‌ణ‌ల‌కు జులైలో పార్లమెంటు ఆమోదం ల‌భించింది.


ఈ చట్టం ప్రకారం హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకపోతే.. రూ.1,000 జరిమానా కట్టాల్సి ఉంటుంది. ఇంతకు ముందు ఇది రూ.100గా ఉంది. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడిపితే.. రూ.5,000 జరిమానా లేదా మూడు నెలల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. వాహ‌న‌దారులారా.. చూశారుగా ప‌రిస్థితి ఎలా ఉందో.. జాగ్ర‌త్త‌మ‌రి.


మరింత సమాచారం తెలుసుకోండి: