ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వినాయక చవితి పండుగ రోజున అందరూ సంతోషంగా వినాయకుడి పూజలు చేస్తే , వినాయకుడి సాక్షిగా ఓ దళిత ఎమ్మెల్యేకు అవమానం జరిగింది. వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని కులం పేరుతో దూషించారు కొందరు టిడిపి నేతలు. వినాయకచవితి వేడుకల సాక్షిగా జరిగిన ఈ ఘటనలో ఎమ్మెల్యే శ్రీదేవి కంటతడి పెట్టారు. తనను అవమానించిన వారిపై న్యాయపోరాటానికి సిద్ధం అవుతున్నారు.
గణేష్‌ చతుర్థి వేడుకల్లో పాల్గొంటే వినాయకుడు మైలపడతాడని ఎమ్మెల్యే శ్రీదేవికి కులం పేరుతో ధూషణ
గుంటూరు జిల్లా తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి స్థానిక టీడీపీ నేతలు చేసిన అవమానకర వ్యాఖ్యలతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. తన నియోజకవర్గంలోని తుళ్లూరు మండలం అనంతవరం గ్రామంలో వినాయక మండపం వద్ద పూజలో పాల్గొనేందుకు వెళ్లిన శ్రీదేవి కి చేదు అనుభవం ఎదురైంది. అయితే ఆమె వ్యతిరేకులు కొందరు ఆమె దళిత మహిళ కాబట్టి పూజలు చేయడాన్ని వ్యతిరేకించారు. శ్రీదేవి గణేష్‌ చతుర్థి వేడుకల్లో పాల్గొంటే వినాయకుడు మైలపడతాడు అంటూ ఆమెను కులం పేరుతో దూషించి హేళన చేశారు.దీంతో మనస్తాపానికి లోనైన ఎమ్మెల్యే కంటతడి పెట్టారు.
 
గణేశ మండపం వద్ద వాగ్వాదం ... టీడీపీ నేతలపై ఎమ్మెల్యే శ్రీదేవి ఫైర్ ...
ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్యవాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి.ఈ సంఘటన తర్వాత శ్రీదేవి మీడియాతో మాట్లాడారు. తనను అవమానించిన టీడీపీ నేతలపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో టీడీపీని చిత్తుచిత్తుగా ఓడించి ప్రజలు బుద్ధి చెప్పినా ఆ పార్టీ నేతలు ఇంకా మారలేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడిపి నేతలు తామే అధికారంలో ఉన్నట్టు ఫీలవుతున్నారని తెలిపారు ఎమ్మెల్యే శ్రీదేవి. ఓ దళిత మహిళా ఎమ్మెల్యేను అని కూడా చూడకుండా తనను కులం పేరుతో దూషించడం తగదని ఆమె పేర్కొన్నారు.నోటికి వచ్చింది మాట్లాడటం,నోరు పారేసుకోవటం టీడీపీ నేతలకు అలవాటని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
తనను అవమానించిన ఘనతనపై న్యాయపోరాటం చేస్తానంటున్న ఎమ్మెల్యే శ్రీదేవి
ఇక దళిత మహిళా ఎమ్మెల్యేను వినాయక పూజ నిర్వహించవద్దని అడ్డుకున్న టిడిపి నేతలపై కేసులు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. అణగారిన వర్గాల వారు అంటే టీడీపీకి ఎప్పుడూ చిన్నచూపేనన్న ఎమ్మెల్యే శ్రీదేవి ఓ మహిళా ఎమ్మెల్యే విషయంలోనే ఇలా ఉంటే సాధారణ ప్రజల విషయంలో ఇంకెలా వ్యవహరిస్తారో ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ ఘటనపైన్యాయం పోరాటం చేస్తానని కూడా శ్రీదేవి తెలిపారు.ఒక మహిళ, అందులోనూ స్థానిక ఎమ్మెల్యే అన్న గౌరవం కూడా లేకుండా ఆమెను హేళన చెయ్యటం , పూజా కార్యక్రమాలు నిర్వహించవద్దని అడ్డుకోవటం అక్కడ ఉన్న వారిని షాక్ కు గురి చేసింది. మొత్తానికి కుల వివక్ష లేదని చెబుతూనే, వేళ్ళూనుకున్న కుల వివక్షకు ఈ ఘటన సాక్ష్యంగా నిలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: