ఔను.. జగన్ ఓ ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని పిలిపించుకుని వార్నింగ్ ఇచ్చారు. మరోసారి ఇలా జరగకూడదని తేల్చి చెప్పేశారు.. 40 ఏళ్ల నుంచి తమ కుటుంబాన్ని నమ్ముకున్న ప్రజలకు అన్యాయం జరిగితే సహించేది లేదని యూసీఐఎల్ అధికారులకు ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. ఇంతకీ విషయం ఏమిటంటారా.. జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలోని తుమ్మలపల్లిలో యూరేనియం ఫ్యాక్టరీ ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పని చేస్తుంది.


ఈ ఫ్యాక్టరీ నుంచి వచ్చే యురేనియ వ్యర్థాల కారణంగా చుట్టుపక్కల గ్రామాల్లోని రైతుల భూగర్భ జలాలు పాడైపోతున్నాయట. పంటలు పండటం లేదట. దీనిపై ఈనాడు పత్రిక మొన్న బ్యానర్ స్టోరీ వేసింది. నిపుణులతో ఇంటర్వూ ఇచ్చింది. దీంతో సీఎం జగన్ స్పందించారు. పరిస్థితిని అధ్యయనం చేయమని ఇప్పటికే ఓ కమిటీ వేశారు.


సోమవారం సొంత జిల్లాకు వెళ్లిన జగన్.. ఈ ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని పులివెందుల పిలిపించుకుని చర్చించారు. యురేనియం కర్మాగారం నుంచి ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. తుమ్మలపల్లి యురేనియం ఫ్యాక్టరీ అధికారులతో చాలా సేపు చర్చించారు. ఇక నుంచి ఈ విషయం నేనే చూసుకుంటా.. ప్రతి నెలా పరిశీలిస్తా.. అని చెప్పేశారు.


ప్రతినెలా కర్మాగారం స్థితిగతులపై తాను నివేదిక తెప్పించుకుంటానని సీఎం జగన్ అన్నారు. ఈ వ్యవహారం మొత్తాన్ని పరిశీలించే బాధ్యతను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి , ఎంపీ అవినాశ్ రెడ్డిలకు అప్పగించారు. యురేనియం కర్మాగారం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ఎందుకు పరిష్కారం చూపడం లేదని ఆయన ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని గట్టిగానే నిలదీసినట్టు తెలుస్తోంది. ఈ మీటింగ్ లో కడప ఎంపీ అవినాశ్ రెడ్డి, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హరికిరణ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: