ఇటీవల ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీకి వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి.  ఆ పార్టీకి చెందిన ముఖ్య నేతలంతా వరుస పెట్టి బీజేపీ చేరిపోయిన విషయం తెలిసిందే. మరికొందరు వైసీపీలో చేరుతున్నారు. ఈ నేపథ్యంలోనే చిరకాల శత్రువులుగా ఉన్న ప్రస్తుతం టీడీపీలో మిత్రులుగా కొనసాగుతున్న కడప జిల్లా నేతలు ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డిలు అధినేత చంద్రబాబుకు షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇందులో ఆదినారాయణ బీజేపీలోకి వెళ్ళేందుకు రంగం సిద్ధం చేసుకోగా, రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.


ఇక‌ రామసుబ్బారెడ్డి ముందు నుంచి టీడీపీలోనే ఉన్నారు. ఆదినారాయణ రెడ్డి కాంగ్రెస్ లో ఉండేవారు. వీరిద్దరు జమ్మలమడుగు నుంచి ప్రత్యర్ధులగా బరిలోకి దిగేవారు. వీరి వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేల గొడవలు ఉండేవి. అయితే ఆదినారాయణ రెడ్డి 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి రామసుబ్బారెడ్డిపై విజయం సాధించారు. కానీ టీడీపీ అధికారంలోకి రావడంతో ఆది జంప్ కొట్టేశారు. చంద్రబాబు ఆదికి మంత్రి కూడా ఇచ్చారు. ఇక రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చారు.


అయితే ఇద్దరు ఒకే పార్టీలో ఉన్న పెద్ద పొసగదే కాదు. కానీ మొన్న ఎన్నికల ముందు బాబు ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చారు. దీంతో రామసుబ్బారెడ్డి జమ్మలమడుగు అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓడిపోతే, ఆది కడప పార్లమెంట్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.  పైగా రాష్ట్రంలో పార్టీ కూడా ఘోరంగా ఓడిపోవడంతో ఈ ఇద్దరు శత్రువులు ఎవరు దారి వాళ్ళు చూసుకునేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి బీజేపీలోకి వెళ్తున్నట్టు సంకేతాలు ఇస్తున్నారు. లోకల్‌లో ఇబ్బందులు ఉన్నాయంటూ ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరబోతున్నార‌ట‌.


అటు ఆది బీజేపీలోకి వెళుతుంటే రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరడానికి రెడీ అయ్యారని తెలుస్తోంది. ఇటీవల జగన్ అమెరికా వెళ్లిన సమయంలో అక్కడే రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరికపై చర్చలు జరిగినట్టు ప్రచారం జరుగుతోంది. నంద్యాల ప్రాంతానికి చెందిన ఒక వైసీపీ నేత ఈ విషయంలో మధ్యవర్తిత్వం వహించారని సమాచారం. కాబట్టి త్వరలోనే రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరడం ఖాయమని చెబుతున్నారు. మొత్తానికి శత్రువులు ఇద్దరు తమ దారి తాము చూసుకొనున్నారన్న‌మాట. 


మరింత సమాచారం తెలుసుకోండి: