తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు తీపిక‌బురు వినిపించారు. రాజేంద్రనగర్‌లోని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ వేదికగా జరిగిన సదస్సులో ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ ప‌దవీ విర‌మ‌ణ వ‌య‌సు పెంచుతామని స్పష్టం చేశారు. మండల, జిల్లా పరిషత్‌ సమావేశాల్లో అధికారులు, ఉద్యోగులను పరుష పదజాలంతో దూషించడాన్ని సహించమని, అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయోపరిమితిని 60 లేదా 61 సంవత్సరాలకు పెంచుతామని స్పష్టం చేశారు. 


తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల ప‌క్ష‌పాతిగా ఉంటుంద‌ని కేసీఆర్ అన్నారు. ''అన్ని శాఖల్లో ఉద్యోగుల ప్రమోషన్‌ చార్ట్‌ను రూపొందించాలని, తమకు ఏ తేదీన ప్రమోషన్‌ వస్తుందో ఉద్యోగికి తెలిసి ఉండాలి. పదోన్నతుల కోసం పైరవీలు చేసే దుస్థితి పోవాలి. ఉద్యోగులు పదోన్నతుల విషయంలో వేసుకున్న కేసులను ఉపసంహరించుకోవాలి. అందరికీ పదోన్నతులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అవసరమైతే సూపర్‌ న్యూమరీ పోస్టులను కూడా సృష్టిస్తాం. తెలంగాణ ప్రభుత్వం భారీ పరిపాలనా సంస్కరణలు తీసుకొచ్చింది. కొత్త జిల్లాలు, కొత్త డివిజన్లు, కొత్త మండలాలు ఏర్పాటు చేసింది. తండాలు, గూడాలు, శివారు పల్లెలకు ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటయ్యాయి. గ్రామ పంచాయతీల సంఖ్య 8,690 నుంచి 12,751కు పెరిగాయి. 3,146 మంది ఎస్టీలు సర్పంచ్‌లు అయ్యే అవకాశం కలిగింది. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కొత్త పంచాయతీరాజ్‌ చట్టం తీసుకొచ్చింది. గ్రామ పంచాయతీలు నేలవిడిచి సాము చేయవద్దు. గ్రామ పంచాయతీలు ప్రజల భాగస్వామ్యంతో గ్రామాల రూపులేఖలు మార్చాలి. గ్రామ స్థాయిలో ప్రభుత్వమే చాలా పనులు నిర్వహిస్తున్నదని'' సీఎం పేర్కొన్నారు. 


''మిషన్‌భగీరథ ద్వారా మంచినీరు అందిస్తున్నాం. నిరంతర విద్యుత్‌ అందిస్తున్నాం. రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు అమలు చేస్తున్నాం. మిషన్‌కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరించాం. పాఠశాలల్లో విద్యార్థులకు సన్నబియ్యంతో అన్నం పెడుతున్నాం. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారం అందిస్తున్నాం. రేషన్‌షాపుల ద్వారానే బియ్యం, ఇతర సరుకులు సరఫరా చేస్తున్నాం. ఆసరా పెన్షన్లు, కేసీఆర్‌ కిట్‌లు, కల్యాణలక్ష్మీ ప్రభుత్వ యంత్రాంగం ద్వారానే జరుగుతున్నది. రహదారులు, వంతెనలు, ప్రభుత్వ కార్యాలయాలు నిర్మాణాలు గ్రామ పంచాయతీలపై ఎలాంటి భారం పడకుండా ప్రభుత్వమే నిర్వహిస్తుంది. వార్షిక పంచవర్ష ప్రణాళికలకు అనుగుణంగా బడ్జెట్‌ రూపొందించడం క్రమం తప్పకుండా పన్నులు వసూలు చేయడం, విద్యుత్‌ బిల్లులు వసూలు చేయడం, వీధిలైట్ల పనితీరు బాధ్యత కూడా గ్రామ పంచాయతీలు నిర్వహించాలని'' ముఖ్యమంత్రి వివరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: