పార్టీ ఓడిపోయిన తరువాత చినబాబు పూర్తిగా ట్విట్టర్ పిట్టగా మారిపోయిన సంగతి తెలిసిందే. ఆయన ఎంతసేపూ జగన్ని ఆడిపోసుకోవడానికే ట్విట్టర్ ని ఉపయోగిస్తున్నారు. జగన్ని ఏదో అనాలన్న ఆరాటంలో దొరికిపోతున్న సందర్భాలు కూడే ఎక్కువే. ఇక జనంలోకి రావడానికి, మీడియాకు ముఖం చూపించడానికి మూడు నెలల గడువు పెట్టుకున్న చినబాబు ఇసుక పై ధర్నాతో ఆ గడువు ముగిసిందని చెప్పేశారు. 


ఇపుడు తొలి పర్యటనగా ఉత్తరాంధ్రాకు వస్తున్నారు. విశాఖ జిల్లాలో సీనియర్ నేత మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు జన్మదినమైన ఈ రోజున లోకేష్ ఆయనతో కలసి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా లోకేష్ నర్శీపట్నం నుంచి సమరశంఖం పూరిస్తారట. 


జగన్ పాలనపై ఉత్తరాంధ్ర వేదికగా చినబాబు విరుచుకుపడడానికి అనేక కారణాలు ఉన్నాయి. తాజా ఎన్నికల్లో పార్టీకి ఇక్కడ గుండు సున్నా అయింది. విశాఖ రూరల్ జిల్లా మొత్తానికి మొత్తం వైసీపీకి దాసోహం అయిపోయింది. ఇక తాజాగా విశాఖ జిల్లాలో బలమైన విశాఖ డైరీ చైర్మన్ ఆడారి తులసీరావు కుటుంబం మొత్తం వైసీపీలో చేరిపోయింది. రూరల్ జిల్లా టీడీపీ ప్రెసిడెంట్ పంచకర్ల రమేష్ బాబు కూడా బీజేపీలో చేరిపోతారని అంటున్నారు.


మరో వైపు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సైతం పార్టీ మార్చేస్తారన్న ప్రచారం వూపందుకుంది. ఈ నేపధ్యంలో  చినబాబు టూర్ వేశారని అంటున్నారు. పెదబాబు వచ్చినా కూడా పార్టీలో నుంచి వెళ్ళిపోయే నేతలు ఆగరని, చినబాబు వచ్చి ఏం చేయగలరని కూడా అంటున్నారు. ఏది ఏమైనా చినబాబు టీడీపీకి ఒకనాటి కంచుకోట నుంచి జగన్ పై బాణాలు వేయడానికి రెడీ అవుతున్నారన్న మాట. చూడాలి ఈ రాజకీయ తమాషా ఎలా ఉంటుందో.  లోకేష్ తమ్ముళ్ళను ఎలా అట్రాక్ట్ చేస్తారో.



మరింత సమాచారం తెలుసుకోండి: