ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆర్టీసీ ఉద్యోగులు ఎన్నో సంవత్సరాల నుండి కంటున్న కలను నెరవేర్చబోతున్నారు. ఆర్టీసీలో పనిచేసే ఉద్యోగులంతా ఇకనుండి ప్రభుత్వ ఉద్యోగులు కాబోతున్నారు. ఆర్టీసీ విలీనంతో దాదాపు 52 వేల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని హామీ ఇచ్చారు. 
 
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయటం జరిగింది. మూడు నెలల పాటు ఈ కమిటీ అధ్యయనం చేసి నివేదికను సీఎం జగన్ గారికి సమర్పించింది. నిపుణుల కమిటీ నుండి నివేదిక అందిన తరువాత సీఎం జగన్మోహన్ రెడ్డి మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి సమావేశంలో ఆర్టీసీ విలీనానికి సంబంధించిన నిర్ణయాలను తీసుకున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటం కోసం ప్రభుత్వం ప్రజా రవాణా శాఖను కొత్తగా ఏర్పాటు చేయబోతుంది. 
 
ట్రాన్స్ పోర్ట్ రెగ్యులేషన్ కమీటీని ఏర్పాటు చేసి బస్సు ఛార్జీలు ఫెయిర్ గా ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించినట్లు సమాచారం. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటం వలన ప్రభుత్వంపై 3,500 కోట్ల రుపాయల భారం పడుతుందని తెలుస్తుంది. ఆర్టీసీకి సంబంధించిన విధి విధానాలు త్వరలో ఖరారు కాబోతున్నట్లు సమాచారం. దశల వారీగా ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొని రాబోతున్నట్లు రవాణా శాఖ మంత్రి పేర్ని నాని చెప్పారు. 
 
ఈరోజు జరిగే కేబినేట్ సమావేశంలో ఆర్టీసీ విలీనం ఆమోదం పొందబోతుంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయబోతూ ఉండటం పట్ల ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ ఉద్యోగులు కోరుకుంటున్న విధంగా ఆర్టీసీ విలీనం ప్రక్రియ ఉండాలని ఆర్టీసీ ఉద్యోగులు కోరుకుంటున్నారు. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం కావటం వలన ప్రభుత్వం మెరుగైన సౌకర్యాలను ప్రయాణికులకు కల్పించటం ద్వారా లాభాల బాటలో ఆర్టీసీని పయనించేలా చేయబోతున్నట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు. 


 
 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: