ఖమ్మం జిల్లాలో కురుస్తున్న వర్షాలకు ప్రకాశం బ్యారేజీకి వరద మొదలైంది. మున్నేరు, మధిర వాగుల నుంచి నీటిప్రవాహం కొనసాగుతోంది. ఈ రెండు వాగుల నుంచి 30వేల క్యూసెక్కుల నీరు బ్యారేజీకి వస్తోంది. మొన్నటి వరకు అంతర్రాష్ట్ర వరదతో పొంగిపొర్లిన బ్యారేజీకి ఇప్పుడు లోకల్ వరద  పోటెత్తితుంది. బ్యారేజీ నిర్వహణ అధికారులు మొత్తం 20 గేట్లను అడుగు మేర ఎత్తారు. వీటితో 33వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఇందులో 18,500 క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వెళ్తుండగా, మరో 14,500 క్యూసెక్కుల నీటిని కాల్వలకు ఇస్తున్నారు. కొద్దిరోజుల క్రితం వచ్చిన వరదల కారణంగా సుమారుగా 300 టీఎంసీల సముద్రంలోకి వెళ్లింది.బ్యారేజీ ఎగువ, దిగువ భాగాలు నిండు కుండలా కనిపించాయి.





మళ్లీ ఇప్పుడే అదే పరిస్థితి పునరావృత్తమైంది. మరో రెండు, మూడు రోజులపాటు ఖమ్మం జిల్లా నుంచి వరద నీరు వస్తుందని అధికారులు చెబుతున్నారు. వరద కారణంగా వినాయక నిమజ్జనానికి జరుగుతున్న ఏర్పాట్లకు అంతరాయం ఏర్పడింది. ఏటా బ్యారేజీకి దిగువన విగ్రహ నిమజ్జనాలకు ఏర్పాట్లు చేస్తారు. బ్యారేజీ 20 గేట్లను ఎత్తడంతో ఈ పనులకు ఆటంకం కలిగింది. శ్రీశైలం జలాశయానికి జూరాల నుంచి విద్యుదుత్పత్తి ద్వారా 7,696 క్యూసెక్కుల వరద వస్తోంది.  డ్యాంలో మంగళవారం సాయంత్రం 6 గంటల సమయానికి 877.80 అడుగుల వద్ద 177.1490 టీఎంసీల నిల్వలు నమోదయ్యాయి. ఈ సమయానికి విద్యుదుత్పత్తి చేయడం లేదు.






వెనుక జలాల నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ ద్వారా 24,500 క్యూసెక్కులు, హంద్రీ-నీవా సుజల స్రవంతికి 2,026 క్యూసెక్కులు, మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 2,400 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. మొత్తం ఔట్‌ ఫ్లో 28,926 క్యూసెక్కులు. గడచిన 24 గంటల వ్యవధిలో శ్రీశైలం కుడి, ఎడమగట్టు విద్యుత్‌ కేంద్రాల నుంచి 0.088 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసి గ్రిడ్‌కు అందించారు. జలాశయం నుంచి 29,110 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. గడచిన 24 గంటల వ్యవధిలో పట్టణంలో 5.80 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.


మరింత సమాచారం తెలుసుకోండి: