కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ట్రబుల్‌ షూటర్‌ డికె శివకుమార్‌ ను ఈడీ అరెస్ట్‌ చేయడంతో ఆయన మద్దతు దారులు ఆందోళనలకు దిగారు. అరెస్ట్‌ నిరసిస్తూ కర్ణాటక బంద్‌ కు పిలుపునిచ్చారు. రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. ఆర్టీసీ బస్సులకు నిప్పంటించారు. బంద్‌ రాష్ర్టంలో విద్యా సంస్థలు, వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి. ఈ స‌మ‌యంలోనే సిద్ధ‌రామ‌య్య ఆగ్రహానికి గురయ్యారు. మైసూరు ఎయిర్‌ పోర్టులో తన అనుచరుడిని మీడియా ముందే లాగి పెట్టి కొట్టారు.


డీకే శివకుమార్‌ అరెస్ట్‌ నేపథ్యంలో జరుగుతున్న కర్ణాటక బంద్‌ లో పాల్గొనడానికి వచ్చిన సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడారు. ఆ సమయంలో ఆయన సహాయకుడు ఫోన్‌ తీసుకువచ్చి చెవి వద్ద పెట్టడంతో కోపంతో ఊగిపోయారు. సహనం కోల్పోయి చెంపదెబ్బ కొట్టారు. సిద్ధరామయ్య ప్రవర్తనను పలువురు నేతలు తప్పుబడుతున్నారు. ఇప్పుడీ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. 


ఇదిలాఉండ‌గా, పోలీసులు ముఖ్యమంత్రి బిఎస్‌ యెడియూరప్ప నివాసం వద్ద భద్రతను మరింత పటిష్టపరిచారు. కాంగ్రెస్‌ పట్టు ఉన్న జిల్లాల్లోని బిజెపి కార్యాలయాల వద్ద కూడా భద్రతను పెంచారు. ఇదిలాఉండ‌గా, మనీ ల్యాండరింగ్‌ కేసులో ఈడీ అధికారుల చేతిలో అరెస్టైన కర్ణాటక కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు డీకే శివకుమార్‌ ఢిల్లీలోని ఆర్‌ఎంఎల్‌ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అయితే విచారణలో ఒత్తిడికి గురై అనారోగయం పాలయ్యారు ట్రబుల్‌ షూటర్‌. దీంతో ఆయన్ను హాస్పిటల్‌ కు తరలించారు. డీకేను పరామర్శించడానికి వచ్చిన ఆయన మద్దతుదారులు..ఈడీ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. విచారణ పేరుతో ఆయనను వేధింపులకు గురిచేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. డాక్టర్లు ఆయనకు విశ్రాంతి అవసరమంటున్నారు.


శివకుమార్‌తోపాటు ఢిల్లీలోని కర్ణాటక భవన్‌లో ఉద్యోగిగా పనిచేస్తున్న హనుమంతయ్య తదితరులపై గతేడాది సెప్టెంబర్‌లో ఈడీ కేసు నమోదుచేసింది. పన్ను ఎగవేత, కోట్ల రూపాయల హవాలా లావాదేవీలపై ఐటీ శాఖ గతేడాది బెంగళూరులోని ప్రత్యేక కోర్టులో కేసు నమోదు చేసింది. బీజేపీ కర్ణాటక అధికార ప్రతినిధి ఎస్‌ ప్రకాశ్‌ స్పందిస్తూ ఢిల్లీలోని శివకుమార్‌ ఇంట్లో రూ.8 కోట్ల నగదు దొరికిందని గుర్తు చేశారు. ‘ఇది పూర్తిగా అవినీతి కేసు. రాజకీయ ప్రేరేపితం కాదు. మాపై ఆరోపణలు నిరాధారం’ అని తిప్పికొట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: