ఇటీవ‌లి కాలంలో టీఆర్ఎస్ పార్టీలో సైడ్ ట్రాక్ అయిన‌ట్లుగా ప్రచారం జ‌రుగుతున్న మాజీ ఉప ముఖ్య‌మంత్రి, పార్టీ సీనియ‌ర్ నేత క‌డియం శ్రీ‌హ‌రి తాజాగా ఆస‌క్తిక‌ర ప‌రిణామంతో తెర‌మీద‌కు వ‌చ్చారు. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న‌ కాళేశ్వరం ప్రాజెక్టును త‌న అనుచ‌రుల‌తో సంద‌ర్శించి....కేసీఆర్ క‌ళ్ల‌ల్లో ప‌డేందుకు ప్ర‌య‌త్నం చేశారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలతోపాటు కన్నెపల్లి పంపు హౌస్ ను సందర్శించడానికి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి సందర్శించారు. తన వెంట సుమారు ఎనిమిది వేల మంది టీఆర్‌ఎస్‌ శ్రేణులతో కలసి ప్రాజెక్టులను సందర్శించారు. అనంతరం కడియం శ్రీహరి మాట్లాడారు.


కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ఇంజినీరింగ్ అద్భుతమని క‌డియం శ్రీ‌హ‌రి కొనియాడారు. తెలంగాణ కోటి ఎకరాల మాగాణి కావాలని సీఎం కేసీఆర్‌ కృషి చేస్తుంటే పనిలేని వాళ్లు ఉనికి కోసం విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.  కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతుంటే విచిత్రంగానూ విడ్డూరంగా ఉందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ కాలం అధికారంలోఉండి తెలంగాణ ప్రాజెక్టులను పట్టించుకోకుండా తెలంగాణకు రావాల్సిన నీటిని ఆంధ్రాకు మళ్లించారని ఆరోపించారు. గోదావరి, కృష్ణా జలాలపై నీటి హక్కులను కాపాడకపోగా.. తెలంగాణకు జరిగిన అన్యాయంపై ఏ ఒక్కరూ మాట్లాడలేదన్నారు. కాంగ్రెస్‌ నాయకులకు అవినీతి అక్రమాల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికైనా కళ్లు తెరిచి తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పేర్కొన్నారు.


ఏదో నాలుగు సీట్లు రాగానే బీజేపీ ఎగిరి పడడం కరెక్ట్ కాదని కడియం శ్రీహరి ఎద్దేవా చేశారు. బీజేపీకి తెలంగాణపై చిత్తశుద్ది ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కడియం శ్రీహరి డిమాండ్‌ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా గురించి మాట్లాడని బీజేపీ నేతలు.. తెలంగాణ ప్రజల గురించి మాట్లాడితే వినడానికి సిద్ధంగా లేరని చురకలు అంటించారు. బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే ప్రధాని మోదీని ఒప్పించి కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీకి అనుమతులు ఇప్పించి అప్పుడు మాట్లాడాలన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: