తెలంగాణకి కొత్త గవర్నర్ రావడం టీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందిగా మారిందా? తమకు మేలు చేసే నరసింహన్ బదిలీ అవడం గులాబీ పార్టీకి నష్టమేనా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఉమ్మడి ఏపీకి విడిపోక ముందు నుంచి నరసింహన్ గవర్నర్ గా పని చేస్తున్నారు. రాష్ట్రం విడిపోయిన ఏపీ, తెలంగాణలకు ఉమ్మడి గవర్నర్ గా పని చేశారు. మొత్తం మీద తొమ్మిదిన్నర సంవత్సరాలు నరసింహన్ గవర్నర్ గా సేవలు అందించారు. అయితే ఈ కాలంలో నరసింహన్ ఎక్కువ గులాబీ బాస్ కేసీఆర్ కు అనుకూలంగానే నడిచారనే వాదనలు వినిపించాయి.


రాష్ట్రం విడిపోక ముందు ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ కు బాగానే హెల్ప్ చేశారనే ప్రచారం కూడా ఉంది. ఇక తెలంగాణ వచ్చాక అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి నరసింహన్ సహకారం ఎంత ఉందో అందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కాలంలో, శాంతి భద్రతలు కాపాడుతూ ఉద్యమకారులకి గవర్నర్ మేలు చేశారనే అభిప్రాయం టీఆర్ఎస్‌ నేతల్లో ఉంది. అటు అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వానికి గవర్నర్ అందించిన సలహాలు, సూచనలు తమకు చాలా ఉపయోగపడ్డాయని గులాబీ నేతలు చాలా సమయాల్లో చర్చించుకున్నారు. 


మంత్రివర్గ కూర్పు, టీడీపీ నేతలనీ చేర్చుకుని మంత్రి పదవి ఇవ్వడం, పథకాలు అమలులో గులాబీ పార్టీకి నరసింహన్ సహకారం అందడం బహిరంగ రహస్యమే. ఇక గులాబీ బాస్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళడం, మళ్ళీ ఎన్నికల్లో గెలవడానికి నరసింహన్ సూచనలు కూడా ఉన్నాయని చెప్పుకుంటూనే ఉన్నారు.   అలాగే రాష్ట్ర విభజన అంశాల్లో అప్పుడు చంద్రబాబు హయాంలో గానీ, ఇప్పుడు జగన్ హయాంలో గానీ తెలంగాణకు ఎక్కువ మేలు జరిగేలా జాగ్రత్తలు కూడా తీసుకున్నారని అంటారు. 


అదే విధంగా కేంద్రంలో జరిగే ప్రతి పరిణామాన్ని ముందే కనిపెట్టి కేసీఆర్ ని జాగ్రత్తగా ఉండేలా చేశారని కూడా చెబుతారు. మొత్తం మీద నరసింహన్ గులాబీ బాస్ కు ఓ సలహాదారుగా పని చేశారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని రాజకీయ విశ్లేషుకులు చెబుతారు. అయితే ఇంతలా గులాబీ బాసుకు హెల్ప్ చేసిన నరసింహన్ ని కేంద్రం తాజాగా తప్పించి ఆ స్థానంలో తమిళనాడుకు చెందిన బీజేపీ నాయకురాలు తమిళసై సౌందర రాజన్‌ని నియమించారు. దీంతో గులాబీ పార్టీలో గుబులు మొదలైంది. సౌందర రాజన్‌ని గవర్నర్‌గా కేంద్రం నియమించడంలో బీజేపీ వ్యూహం ఉందని టీఆర్ఎస్ అధిష్టానం భావిస్తోంది. 


తెలంగాణలో అధికారంలోకి రావాలని కలలు కంటున్న బీజేపీ తమిళసైని గవర్నర్‌గా నియమించిందని అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే గత గవర్నర్‌లాగా సపోర్ట్ చేయకుండా, సౌందర రాజన్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే అవకాశం లేకపోలేదని టెన్షన్ పడుతున్నారు. పైగా రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్న విషయాలను తమిళసై ఎప్పటికప్పుడు బీజేపి అధిష్టానానికి చేరవేసే అవకాశం ఉందని టీఆర్ఎస్ నేతలు ఆలోచనలో పడిపోయారు. చూడాలి మరి రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయల్లో తమిళ సై పాత్ర ఎలా ఉండబోతుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: