ఈ నెల 1 నుండి ప్రారంభమైన కొత్త మోటారు వాహనాల చట్టంతో వాహనదారులపై జరిమానాల మోత మోగిపోతుంది. ఈ చట్టం అమల్లో ఉన్న రాష్ట్రాల్లో ట్రాఫిక్‌ ఉల్లంఘనకు పాల్పడిన వారికి భారీగా  ఫైన్‌లు వేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. బుధవారం ఒడిసాలో హరిబంధు కన్హర్‌ అనే  వ్యక్తి  మద్యం తాగి ఆటో నడిపాడు. దీనితో ఆ వ్యక్తికి రూ. 47,500 జరిమానా విధించారు. మద్యం తాగి ఆటో నడపడమే కాకుండా అతని వద్ద ఆటోకు సంబంధించిన డాక్యూమెంట్స్ కూడా  లేవు. దీనితో ఈ రేంజ్ లో  జరిమానా పడింది. 

అయితే ఆ జరిమానాను తాను కట్టలేనని హరిబంధు చెప్పాడు. వారు నా ఆటోను సీజ్‌ చేసినా, నన్ను జైలుకు పంపినా.. నేను జరిమానా కట్టలేను అని అన్నాడు. కాగా, ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా గురుగ్రామ్‌ పోలీసులు ఓ ట్రక్‌ డ్రైవర్‌కు ఏకంగా రూ. 59,000 చలానా రాశారు. సిగ్నల్‌ జంప్‌ చేశాడని ఓ ఆటో డ్రైవర్‌కు రూ. 32,500 జరిమానా విధించారు. 

పశ్చిమ బెంగాల్‌కు చెందిన మహమ్మద్‌ ముస్తాకిన్‌ అనే వ్యక్తి కొన్నేళ్లుగా గురుగ్రామ్‌లో ఉంటున్నాడు. దినసరి కూలీగా పనిచేసే అతడు రెండు నెలల క్రితమే ఆటో కొనుక్కొన్నాడు. మంగళవారం ట్రాఫిక్‌ సిగ్నల్‌ జంప్‌ చేయడంతో పాటు అతని వద్ద సరైన పత్రాలు లేకపోవడంతో పోలీసులు భారీ జరిమానా విధించారు. ఇంతకుముందు గురుగ్రామ్‌లోనే ఓ స్కూటీవాలాకు రూ. 23,000 ఫైన్‌ వేయడంతో అతడు తన స్కూటీని పోలీసుల

దగ్గరే వదిలేసి వెళ్లిన విషయం ఇప్పటికే సోషల్ మీడియా లో వైరల్ అయిన విషయం తెలిసిందే. 
ఈ కొత్త రూల్స్ ప్రకారం అధికారుల ఆదేశాల పట్ల విధేయత చూపనివారికి కనీసం రూ.2 వేలు జరిమానా విధించవచ్చు. లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేసినందుకు రూ.5 వేలు, ఇన్సూరెన్స్ కాపీ లేకుండా డ్రైవ్ చేస్తే రూ.2 వేలు జరిమానా విధించవచ్చు. అనుమతించిన వేగం కన్నా ఎక్కువ వేగంతో వాహనాన్ని నడిపితే రూ.1,000 నుంచి రూ.2,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. సీటు బెల్టు పెట్టుకోకపోతే రూ.1,000 జరిమానా విధించవచ్చు. హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాన్ని నడిపిన వ్యక్తికి రూ.1,000 జరిమానా విధిస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి: