అమరావతి రాజధాని విషయంలో చంద్రబాబు సర్కార్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అది అందరికీ గుర్తుండే ఉంటుంది. ఓ వైపు మన రాజధానికి కేంద్రమే సరిగ్గా నిధులు ఇవ్వలేని పరిస్థితి. ఈ నేపధ్యంలో సింగపూర్ ప్రభుత్వం అద్భుతమైన రాజధాని కట్టేందుకు ముందుకు వచ్చిందని టీడీపీ, దాని అనుకూల మీడియా అప్పట్లో తెగ ఆర్భాటం చేశాయి. సింగపూర్ లాంటి మరో నగరం వెలిసిపోతోందని కూడా కధలు చెప్పాయి. సీన్ కట్ చేస్తే..


సింగపూర్ ప్రభుత్వానికి అమరావతికి ఎక్కడా ఎటువంటి సంబంధం లేదు. పైగా అక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులతో నాటి చంద్రబాబు సర్కార్ రాసుకుపూసుకు తిరిగినట్లుగా వెల్లడైంది. దాంతో ఆ రియల్ ఎస్టేట్ కంపెనీలే అమరావతిలో హల్ చల్ చేశాయి. పోనీ వారైన సరిగ్గా ఇక్కడ ఏమైనా చేశారా అంటే అదీ లేదు.


కేవలం 350 కోట్ల పెట్టుబడులు సింగపూర్ రియల్ ఎస్టేట్ కంపెనీలవైతే వారికి ఇక్కడ రైతుల నుంచి తీసుకున్న భూములను నాటి సర్కార్ అభివ్రుద్ధి పేరిట కట్టబెట్టింది. వారు కేవలం 350 కోట్ల పెట్టుబడి పెడితే ఎపి ప్రబుత్వం ఐదువేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి వసతులు కల్పించాలని నిర్ణయించడంపై అప్పట్లోనే  విమర్శలు వచ్చాయి. హైకోర్టు కూడా ఈ తీరును తప్పు పట్టింది.


 అయినా ఆ ప్రాజెక్టు గత రెండేళ్లుగా కదలలేదు.తాజాగా ఆ కంపెనీలు స్వచ్చందంగానే వైదొలగుతున్నట్లు టీడీపీ అనుకూల  మీడియా ఇపుడు లీకులు ఇస్తోంది. అంటే ఏపీలో ప్రభుత్వం మారింది. ఇక తమ ఆటలు సాగవనుకునే సింగపూర్లోని ప్రైవేట్ రియల్ ఎస్టేట్ కంపెనీలు పలాయనం చిత్తగిస్తున్నాయనుకోవాలి. అద్భుతమైన రాజధాని, ఉచితంగా రాజధానికి డిజైన్లు ఇచ్చారు ఇలా సాగిపోయిన ప్రచారంలోని డొల్లతనం ఈ విధంగా బయటపడిందన్నమాట.


నిజంగా వారికే చిత్తసుద్ధి ఉంటే ప్రభుత్వం మారినా పనిచేసేందుకు ముందుకు రావాలి. ఇక్కడ  వ్యక్తిగతమైన ఒప్పందాలే తప్ప ప్రభుత్వపరమైన అనుబంధాలు లేనందువల్లనే పరార్ అవుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా అమరావతి సింగపూర్ కధలు ఇలా ముగిసిపోతున్నాయన్నమాటేగా.


మరింత సమాచారం తెలుసుకోండి: