తెలంగాణలో రాజకీయంగా ఎదిగేందుకు బీజేపీ నాయకత్వం ఫోకస్ పెట్టింది. కొంతకాలంగా బలం పెంచుకునే ప్రయత్నాలు మొదలు పెట్టింది. అందులో భాగంగా ఇతర పార్టీల నుంచి జోరుగా వలసలు కొనసాగుతున్నాయి. కానీ పార్టీలో అనుకున్నంత జోష్ రావడం లేదు. సీనియర్ లీడర్లు ఉన్నారు కానీ పార్టీ తరపున పోరాటాలు,నిరసనలు,ఆందోళనలు ఏమి లేవు. నేతలు ఇలా ఎందుకు తయారయ్యారని ఆరా తీస్తే బీజేపీ హైకమాండ్ కు అసలు విషయం తెలిసిందట.

తెలంగాణ బిజెపి నేతలకు పదవులు లేవని సైలెంటైపోయారట. ఈ విషయం తెలిసిన పార్టీ పెద్దలు నేతలకు పదవులు ఇస్తే మరింత దూకుడుగా పని చేస్తారని అధిష్ఠానం భావిస్తోందట ఇందులో భాగంగా కేంద్ర నామినేటెడ్ పదవుల్లో తెలంగాణ బీజేపీ నేతలకే ఎక్కువ అవకాశాలు ఇవ్వనున్నారని ప్రచారం జరుగుతోంది.

ఎన్నికల్లో ఓడిపోయిన సీనియర్ లతో పాటు కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి అవకాశం ఇవ్వాలనే ఆలోచన హైకమాండ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి ఛాన్స్ ఇస్తే మరింత మంది పార్టీలోకి వలసలు వచ్చే అవకాశముందని హస్తిన నేతల ఆలోచనగా తెలుస్తుంది. ఆర్ఎస్ఎస్ లో పని చేసిన వారే కాకుండా పార్టీ బలోపేతం కోసం వచ్చిన వారికి సైతం అవకాశం ఇచ్చినట్టు ఉటుందని కమలనాథుల అంచనా.

ఇటీవలే పార్టీలో చేరిన డీకే అరుణ పెద్దిరెడ్డితో పాటు ఇంద్రసేనరెడ్డి, గరికపాటి మోహనరావు, వివేక్, కృష్ణసాగరరావు, ధర్మారావు, సుగుణాకరరావు, సంకినేని వెంకటేశ్వర రావు, జంగారెడ్డి రాజేశ్వరరావు, బండారు శ్రావణి పేర్లను నామినేటెడ్ పదవుల భర్తీ కోసం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు పార్టీ పదవుల పంపకాల్లో తెలంగాణ బిజెపిలో మరింత జోష్ నింపేందుకు అధిష్టానం ప్రయత్నాలు చేస్తోందట. మరి ఈ ప్రయత్నం‌ ఎంత వరకు పనిచేస్తుందో వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: