ఆంధ్రప్రదేశ్ లో వలసల పర్వం కొనసాగుతోంది. ప్రతిపక్ష పార్టీల్లో ఉండే నేతలు అధికార పార్టీల్లోకి వెళ్ళేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో చాలామంది టీడీపీ నేతలు బీజేపీలో చేరిపోగా, మరికొందరు వైసీపీలో చేరుతున్నారు. అటు పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన నుంచి కూడా వలసలు కొనసాగుతున్నాయి. ఆ పార్టీకి చెందిన నేతలు వరుసగా పవన్ కల్యాణ్ కు షాక్ ఇస్తూ ఇతర పార్టీల్లో చేరుతున్నారు. ఈ క్రమంలోనే జనసేనకు మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు షాక్ ఇవ్వనున్నారని తెలుస్తోంది.


బాలరాజు జనసేనని వీడి అధికార వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధంచేసుకుంటున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో సీనియర్ నేతగా ఉన్న బాలరాజు దివంగత నేత వైఎస్సార్ ముఖ్య అనుచరుడుగా ముద్రవేసుకున్నారు. 2004 ఎన్నికల్లో పొత్తులో భాగంగా పోటీకి దూరంగా ఉన్న బాలరాజు... 2009 ఎన్నికల్లో పాడేరు నుంచి కాంగ్రెస్ తరుపున గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. ఇక అప్పుడే బాలరాజుని వైఎస్ మంత్రివర్గంలోకి కూడా తీసుకున్నారు.


ఆ తర్వాత వైఎస్ చనిపోయిన రోశయ్య,కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో కొనసాగారు. 2014 రాష్ట్ర విభజన నేపథ్యంలో మరోసారి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక గత ఎన్నికలకు ముందు ఆయన వైసీపీలోకి వెళ్ళి మళ్ళీ పాడేరు నుంచి పోటీ చేయాలని భావించారు కానీ వైసీపీ అధిష్టానం మాత్రం అరకు ఎంపీ సీటు ఇస్తానంది. దీంతో బాలరాజు జనసేనలోకి వెళ్ళి పాడేరు నుంచి పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. పైగా జనసేన కూడా రాష్ట్రంలో దారుణంగా ఓడిపోయింది. దీంతో ఆయన రాజకీయ భవిష్యత్ ఆలోచించుకుని వైసీపీలోకి వెళ్లడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది.


సీఎం జగన్ కూడా బాలరాజుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా బాలరాజు మీడియా సమావేశంలో జగన్ పైన పొగడ్తల వర్షం కురిపించారు. జగన్ ప్రజల కోసం మంచి పథకాలు అమలు చేస్తున్నారని చెబుతూ పరోక్షంగా వైసీపీలోకి వెళుతున్నట్లు సంకేతాలు కూడా ఇచ్చారు. దీని బట్టి చూస్తుంటే బాలరాజు అతి త్వరలోనే జగన్ చెంత చేరడం ఖాయంగా కనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: