విఘ్నాల‌కు తొల‌గించే గ‌ణ‌నాథుడిని ద‌ర్శించుకుంటే విఘ్నాలు తొలుగుతాయ‌ని భావిస్తే ఓ మ‌హిళా ప్ర‌జాప్ర‌తినిధికి కులం పేరుతో దూష‌ణ‌లు త‌ప్ప‌లేదు. కులం తక్కువ‌దానివి నువ్వు వినాయ‌కుడి వ‌ద్ద‌కు రావొద్ద‌ని టీడీపీ నేత‌లు వైసీపీ ఎమ్మెల్యేను దూషించ‌డంతో మ‌నస్థాపం చెందితే సీఎం జ‌గ‌న్ పెద్ద‌న్న‌గా అండ‌గా ఉంటాన‌ని భ‌రోసా ఇచ్చాడు. గుంటూరు జిల్లా తాడికొండ‌ ఎమ్మెల్యే ఉండ‌వ‌ల్లి శ్రీ‌దేవి వినాయ‌కుడి వ‌ద్ద‌కు వెళితే అంటరాని కులం అంటూ టీడీపీ నేత‌లు అగ‌చాట్ల‌కు గురి చేసిన విష‌యం తెలిసిందే.


ఓ ద‌ళిత మ‌హిళా ప్ర‌జాప్ర‌తినిధి విష‌యంలో టీడీపీ నాయ‌కులు వ్య‌వ‌హ‌రించిన తీరుతో తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌య్యాయి. వినాయ‌కుడి వ‌ద్ద‌కు పోతే అవ‌మానం జ‌రిగింద‌ని అవ‌మాన భారంతో ఉన్న ఎమ్మెల్యే శ్రీ‌దేవిని ఆంధ్ర‌ప్ర‌దేశ్ హోంమంత్రి మేక‌తోడి సుచ‌రిత వెంట‌పెట్టుకుని సీఎం జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని క‌లిసారు. ఈ సంద‌ర్భంగా సీఎం జ‌గ‌న్‌కు వినాయ‌కుడి వ‌ద్ద జ‌రిగిన సంఘ‌ట‌న‌ను శ్రీ‌దేవి, సుచరిత వివ‌రించి చెప్పారు. దీంతో ఎమ్మెల్యే శ్రీ‌దేవిని ఓదార్చిన జ‌గ‌న్‌... అధైర్య‌ప‌డ‌వ‌ద్ద‌ని, నీకు అండ‌గా మేమున్నామంటూ భ‌రోసా ఇచ్చారు.


అయితే ఉండ‌వ‌ల్లి శ్రీ‌దేవి త‌న కుటుంబంతో క‌లిసి పూజ చేస్తుండగా టీడీపీ నేత కొమ్మినేని శివయ్యతోపాటు మరికొందరు పెద్దగా అరుస్తూ.. దళిత మహిళ పూజ చేస్తే వినాయకుడు మైల పడతాడని, పూజ చేయొద్దని ఆమె వైపునకు దూసుకెళ్లారు. అంతటితో ఆగకుండా తీవ్ర పదజాలంతో కులం పేరుతో ఆమెను దూషించారు. ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడటమే కాకుండా అడ్డుకోబోయిన పోలీసులను సైతం నెట్టిపడేశారు.  


దీంతో ఎమ్మెల్యే శ్రీదేవి తీవ్ర మనస్తాపానికి లోనై కంటతడి పెట్ట‌కుంటూ పూజ చేయ‌కుండానే వెళ్ళిపోయారు. ఎమ్మెల్యేను  దూషించిన  కేసులో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసులు న‌మోదు చేసిన పోలీసులు ఇప్ప‌టికే ఇద్ద‌రిని అదుపులోకి తీసుకోగా, మ‌రో ఇద్ద‌రు ప‌రారీలో ఉన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: